: ఉమ్మడి రాజధానిలో గవర్నర్ చేతికి ‘పవర్’
ఉమ్మడి రాజధాని హైదరాబాదులో శాంతిభద్రతలపై సర్వాధికారాలను కేంద్రప్రభుత్వం గవర్నరుకు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం... గ్రేటర్ హైదరాబాదు పరిధిలో శాంతిభద్రతల విషయంలో గవర్నరుకు ప్రత్యేక అధికారాలు ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ తెలంగాణ ప్రభుత్వానికి శుక్రవారం సాయంత్రం లేఖ పంపింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్వవస్థీకరణ చట్టంలో పేర్కొన్నట్టు హైదరాబాదులో శాంతిభద్రతల నిర్వహణ బాధ్యత గవర్నరుకే ఉంటుందని ఆ లేఖలో స్పష్టం చేసింది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి సురేశ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, గవర్నర్ ముఖ్య కార్యదర్శి రమేశ్ కుమార్ కు లేఖ రాశారు. అయితే, ఈ ప్రతిపాదనను ఎట్టిపరిస్థితుల్లోను అంగీకరించే ప్రసక్తే లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ ప్రతిపాదన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమంటూ శుక్రవారం సాయంత్రమే సీఎస్ కేంద్రానికి తిరుగు లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల పరిధిలో ఉండే శాంతిభద్రతలను కేంద్రం గవర్నరుకు అప్పగించడం ద్వారా పరోక్షంగా తాను పెత్తనం చేయాలని చూస్తోందన్నారు.