: దేశంలో ఆ రెండు స్మారక కట్టడాల నుంచే అధిక ఆదాయం
భారతదేశంలో ఎన్నో స్మారక, చారిత్రక కట్టడాలు ఉన్నాయి. వాటివల్లే దేశ పర్యాటక రంగం ఎంతో అభివృద్ధి చెందిందంటే అతిశయోక్తి కాదు. ఈ క్రమంలో ఇవి కేంద్రానికి బాగా ఆదాయాన్ని కూడా తెచ్చిపెడుతున్నాయి. ఇరవై ప్రముఖ స్మారక కట్టడాల్లో ఆర్థిక సంవత్సరంలో వాటి నుంచి రూ.80.01 కోట్ల రాబడి వస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీ శ్రీపద్ ఎస్సో నాయక్ రాజ్యసభలో ఇటీవల తెలిపారు. అందులో 361 ఏళ్ల కిందట నిర్మించిన, ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్ కొంచెం కూడా తన వైభవాన్ని కోల్పోకుండా పర్యాటకులను ఆకర్షిస్తూ ఇతర కట్టడాలకంటే అధికంగా ఆర్జనను తెచ్చిపెడుతోందని వివరించారు. ప్రతి ఏడాది తాజ్ లోని సమాధి, అందులోని ఇతర నిర్మాణాలు కలసి సందర్శకుల నుంచి ప్రవేశ రుసుముగా రూ.21.84 కోట్లు వసూలు చేస్తుందని తెలిపారు. ఇక ఆగ్రా ఫోర్ట్ నుంచి ఆర్థిక సంవత్సరంలో రూ.10.22 కోట్లు వస్తుందని వివరించారు. అటు ఢిల్లీలోని చరిత్రాత్మక కుతుబ్ మినార్ రూ.10.16 కోట్లు ఆర్జిస్తూ తృతీయ స్థానంలో, హుమాయున్ టూమ్ (సమాధి) రూ.7.12 కోట్లు) నాలుగో స్థానంలో, రెడ్ ఫోర్ట్ (రూ.6.15 కోట్లు) ఐదవ స్థానంలో నిలిచాయి. ఇక దక్షిణాదిన చారిత్రక కట్టడాల విషయానికొస్తే, హైదరాబాదులోని చార్మినార్ ద్వారా రూ.84.76 లక్షలు, గోల్కొండ ఫోర్ట్ రూ.92.92 లక్షలు ఆర్జిస్తున్నాయట.