: ఇంగ్లిష్ మాకు ఓకే... వారికి ఇబ్బందే సుమా!
ఇంగ్లిష్ మాకైతే ఓకే కాని, గ్రామీణ విద్యార్థులకు ఇబ్బందే కదా అంటున్నారు మన నేతలు. అందుకేనేమో..,వారి నేపథ్యం వేరైనా సీశాట్ విషయంలో గ్రామీణ విద్యార్థులకు అండగా నిలుస్తున్నారు. ఇలా నేపథ్యమేదైనా.., సమస్యపై భేషుగ్గా స్పందిస్తున్న మన నేతల్లో కొందరిని పరిశీలిద్దాం. దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, సాంతం ఆంగ్ల మాధ్యమంలోనే విద్యను కొనసాగించారు. ముగ్గురు పిల్లలను కూడా ఇంగ్లిష్ మీడియంలోనే చదవిస్తున్నారు. అయినా గ్రామీణ విద్యార్థుల తరఫున, సీశాట్ పై ఏకంగా ప్రధానికే లేఖ రాశారు. ఇంగ్లిష్ లో అంతగా ప్రావీణ్యం లేని విద్యార్థులకు బాసటగా నిలిచేలా యూపీఎస్సీ నిర్ణయాన్ని మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక సీశాట్ ను రద్దు చేయాల్సిందేనని గ్రామీణ విద్యార్థుల పక్షాన నిలిచిన ఆప్ అధ్యక్షుడు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, విద్యాభ్యాసం కూడా ఇంగ్లిష్ మీడియంలోనే సాగింది. ఇక ఆయన పెద్ద కూతురు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదువు ముగించి ఐఐటీలో చేరనున్నారు. తనదీ గ్రామీణ నేపథ్యమేనంటూ చెప్పడమే కాకుండా సదరు వేషధారణలోనే కనిపించే లాలూ ప్రసాద్ యాదవ్, కొడుకు తేజస్వీతో కలిసి సీశాట్ పై గ్రామీణ విద్యార్థుల పక్షాన నిలిచారు. పాట్నా వర్సిటీలో ఇంగ్లిష్ మీడియంలోనే రాజనీతి శాస్త్రంలో పీజీ చేసిన లాలూ, తన ఇద్దరు కొడుకులను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివించారు. కూతుళ్లను జార్ఖండ్ లోని మిషనరీ విద్యాలయంలో ఆంగ్ల మాధ్యమంలోనే చదివించారు. కొడుకును గుర్గావ్ లోని గోయెంకా స్కూల్ కు పంపుతున్న ఆర్జేడీ ఎంపీ పప్పూ యాదవ్, సీశాట్ పై విద్యార్థుల పక్షాన వీధుల్లోకి వచ్చి, మరీ అండగా నిలిచారు. పిల్లలను రాజాజీపూర్ లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ లో చదివిస్తున్న ఎస్పీ రాజ్యసభ సభ్యుడు నరేశ్ అగర్వాల్, గ్రామీణ విద్యార్థుల తరఫున వకాల్తా పుచ్చుకుని రాజ్యసభనే స్తంభింపజేశారు.