: ఇరాక్ పై వైమానిక దాడులకు అమెరికా సిద్ధం
ఇరాక్ లో వరుస దాడులతో పేట్రేగిపోతున్న ఇస్లామిక్ మిలిటెంట్లను అణచివేసేందుకు అమెరికా సిద్ధమైంది. భీకర దాడులతో ముందుకుసాగుతున్న మిలిటెంట్లను నిలువరించకపోతే మరింత ప్రమాదకర పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని వైమానిక దాడులకు దిగనున్నట్లు గురువారం ప్రకటించారు. అదే సమయంలో మిలిటెంట్ల దాడుల నేపథ్యంలో ఆపదలో చిక్కుకున్న ఇరాకీ పౌరులకు సహాయం చేయాలని కూడా తమ దేశ వైమానిక దళానికి ఆదేశాలు జారీ చేశారు. మిలిటెంట్ల దాడులతో ఇరాక్ లోని తమ దేశ పౌరులను రక్షించుకునేందుకు దాడులకు దిగకతప్పడం లేదని ఈ సందర్భంగా ఒబామా వ్యాఖ్యానించారు. ఒబామా తాజా ప్రకటనతో 2011లో ఇరాక్ నుంచి సేనలను ఉపసంహరించిన అమెరికా, మళ్లీ ఆ దేశంపై సైనిక పెత్తనానికి దిగినట్లయింది. ఇరాక్ లో మరో యుద్ధకాండకు తెరలేవకూడదన్న భావనతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఒబామా పేర్కొన్నారు. గురువారం నాటికి ఇరాక్ లో మోసుల్ డ్యాంను తమ స్వాధీనంలోకి తీసుకున్న మిలిటెంట్లు, పలు పట్టణాల్లో జెండా ఎగురవేశారు. రాజధాని బాగ్దాద్ కు నీరు, విద్యుత్ సరఫరాను నిలిపివేసేందుకు మిలిటెంట్లు యత్నిస్తున్నారన్న వార్తలతో అమెరికా రంగ ప్రవేశం చేసింది.