: హైదరాబాద్ విచ్చేసిన శ్రీకృష్ణదేవరాయల వారసుడు!
రాయలవారి వారసులు ఇంకా ఉన్నారా?... అని అనుకుంటున్నారా? ఇది నిజం. శ్రీకృష్ణదేవరాయల వారసుడు హైదరాబాద్ వచ్చారు. సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రజలకు సేవ చేస్తున్న రాయలవారి 19వ వారసుడు నగరంలోని మియాపూర్ కు విచ్చేశారు. ఈయన పేరు కూడా శ్రీకృష్ణదేవరాయలే కావడం గమనార్హం. కర్నాటకలోని హంపి సమీపంలో ఉన్న అనేగొంది అనే గ్రామంలో ప్రస్తుత రాయలవారు నివాసం ఉంటున్నారు. అనేగొంది అనే ట్రస్టును ప్రారంభించిన ఆయన ఎప్పట్నుంచో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. నిన్న మియాపూర్ లోని జయప్రకాశ్ నారాయణనగర్ లో గుత్తి నారాయణరెడ్డి సాహితీ పీఠం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'శ్రీకృష్ణదేవరాయల పట్టాభిషేకం' కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాతగారైన రాయలవారి పాలనను, చరిత్రను దశదిశలా వ్యాపింపజేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రజలతో రాయలవారు ఎంతో సఖ్యతతో మెలిగేవారని చెప్పారు. ప్రజల ఉన్నతి కోసం ఎంతో చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సంపాదకులు ఏబీకే ప్రసాద్, నిర్వాహకులు గుత్తి చంద్రశేఖర్ రెడ్డిలతో పాటు పలువురు కవులు, కళాకారులు హాజరయ్యారు.