: కేసీఆర్ కు ఉస్మానియాకు వచ్చి మాట్లాడే దమ్ము ఉందా?: ఇంద్రసేనారెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల ముందు మాట్లాడే దమ్ము ఉందా? అని బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ కు రాజ్యాంగం అంటే తెలుసా? రాజ్యాంగం అంటే గౌరవం ఉందా? అని ప్రశ్నించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఎందుకు ఇంకా ప్రారంభించలేదని ఆయన నిలదీశారు. విద్యార్థుల అకడమిక్ ఇయర్ పోయిన తరువాత ఏమి చేస్తారని ఆయన నిలదీశారు. విద్యార్థులు నష్టపోయిన సమయాన్ని తిరిగి ఎలా తీసుకువస్తారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ తన చేతగానితనాన్ని ఇతరుల మీదికి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. సమగ్ర సర్వే చేస్తామంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ఒక్క రోజులో ఎలా సాధ్యమవుతుందో చెప్పాలని అన్నారు. 19న ఎవరూ ఎక్కడికీ వెళ్లవద్దని, పెళ్లిళ్లు రద్దు చేసుకోవాలని, బస్సులు నడపమని, ప్రైవేటు వాహనాలు నడవనివ్వమని చెప్పడం దేనికి నిదర్శనమని ఆయన ప్రశ్నించారు.