: అమెరికా, యూరప్ దేశాలకు రష్యా ఝలక్
తనపై ఆంక్షలు విధించిన అంతర్జాతీయ సమాజంపై రష్యా ప్రతీకార చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలో అమెరికా నుంచి ఆహార పదార్ధాల దిగుమతిని నిలిపివేయాలని, యూరప్ దేశాల నుంచి పండ్లు, కూరగాయలను కొనుగోలు చేయరాదని రష్యా ప్రభుత్వం నిర్ణయించినట్టు అధికారిక మీడియా 'నొవోస్తి' వెల్లడించింది. ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అమెరికాతోపాటు పాశ్చాత్య దేశాలు రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం తెలిసిందే. కాగా, ఐరోపా దేశాల నుంచి కూరగాయలు, పండ్లు దిగుమతి చేసుకునే దేశాల్లో రష్యా ప్రధానమైనది. అటు, అమెరికా నుంచి ఆహారపదార్ధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో రష్యా 23వ స్థానంలో ఉంది. రష్యా తాజా నిర్ణయంపై అమెరికా స్పందించింది. ఇది పౌరులను ఇబ్బందులకు గురిచేయడమేనని, ద్రవ్యోల్బణానికి దారితీసే ప్రమాదం ఉందని వైట్ హౌస్ పేర్కొంది. ఇదిలావుంటే... రష్యా చర్యలు చూస్తుంటే ఉక్రెయిన్ పై దాడికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోందని నాటో వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అందుకే, అంతర్జాతీయ సమాజంతో సంబంధాలు తెంచుకుంటోందని పేర్కొన్నాయి.