: చానళ్ల బ్యాన్ పై రేణుకా చౌదరి, కేకే మధ్య రాజ్యసభలో వాగ్వాదం
తెలంగాణ రాష్ట్రంలో ఏబీఎన్, టీవీ9 ప్రసారాల నిలిపివేతపై రాజ్యసభలో ఈరోజు (గురువారం) ఎంపీ రేణుకా చౌదరి, టీఆర్ఎస్ సభ్యుడు కె.కేశవరావు మధ్య వాగ్వాదం జరిగింది. చానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం భావప్రకటన స్వేచ్ఛను హరించడమేనని రేణుక అన్నారు. కోర్టు ఆదేశాలిచ్చినా, కేంద్రం నోటీసిచ్చినా తెలంగాణ ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. ఈ సమయంలో కేకే రేణుక ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. చానళ్ల నిలిపివేత రాష్ట్రానికి సంబంధించిన అంశమని గొడవకు దిగారు. దాంతో, సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఈ సమయంలో డిప్యూటీ ఛైర్మన్ పీజే కురియన్ జోక్యం చేసుకుని ప్రసార మాధ్యమాలను అడ్డుకోవడం రాష్ట్ర వ్యవహారం ఎలా అవుతుందని కేకేను ప్రశ్నించారు. కేంద్ర సమాచార ప్రసారాల శాఖకు సంబంధించిన అంశమేనని, రాజ్యసభలో లేవనెత్తడం తప్పులేదని కురియన్ రూలింగ్ ఇచ్చారు.