: ప్రియురాలితో చెక్కేసిన ఎమ్మెల్యే తనయుడు... జగడానికి తెరదీసిన ఇరు కుటుంబాలు


జార్ఖండ్ లో ఓ ఎమ్మెల్యేగారి సుపుత్రుడు తాను ప్రేమించిన అమ్మాయితో చెక్కేయగా ఇరు కుటుంబాలు ఇప్పుడు పోలీస్ కేసులతో బిజీ అయ్యాయి. కాంకే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్ర బైథా తనయుడి పేరు చందన్. అతడు తాను ప్రేమించిన అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడు. అనంతరం ఆమెను తాను పెళ్ళి చేసుకున్నట్టు ఫేస్ బుక్ లో పేర్కొన్నాడు. అంతేగాకుండా ఆ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ప్రొఫైల్లో 'వివాహితుడు' అని చేర్చి, పెళ్ళి ఫొటోలను పోస్టు చేశాడు. అతనలా ఉంటే... ఇక్కడ ఎమ్మెల్యే కుటుంబం, అమ్మాయి కుటుంబం యుద్ధానికి తెరదీశాయి. తన కుమార్తెను ఎమ్మెల్యే, అతని కొడుకు కిడ్నాప్ చేశారని అమ్మాయి తండ్రి కేసు పెట్టగా... తన కుమారుణ్ణి అమ్మాయి తండ్రి అపహరించాడని ఎమ్మెల్యే కేసు పెట్టారు. ఈ వ్యవహారంపై ఎమ్మెల్యే బైథా స్పందిస్తూ "పెళ్ళి చేసుకుంటే తప్పేంటి?" అని వ్యాఖ్యానించగా, అమ్మాయి తండ్రి శివ్ కుమార్ మహతో ఆ వ్యాఖ్యలను ఖండించారు. కథ ఇంతటితో ముగియలేదు. ఈ ఎమ్మెల్యే గారి పుత్రరత్నానికి ఇది వరకే రెండు వివాహాలు జరిగాయట. ఓ అదృష్టవంతురాలు వారానికే అతని నుంచి విడిపోగా, రెండో భార్య కొన్నాళ్ళు కాపురం చేసి ఇద్దరు పిల్లలను కన్న తర్వాత వెళ్ళిపోయిందట. ఈ వ్యవహారంపై పోలీసులు స్పందిస్తూ... ఆ ఇద్దరు స్త్రీలతో చందన్ కు విడాకులు మంజూరు అయి ఉంటే... తాజా పెళ్ళి చెల్లుబాటు అవుతుందని, లేకుంటే, నేరమని పేర్కొన్నారు. అన్నట్టు... చందన్ తన తాజా భార్యతో రెండు నెలల క్రితం చెక్కేయగా, బంధువులు వెనక్కి తీసుకువచ్చారట. ఈసారి మాత్రం పెళ్ళి చేసుకుని కథకు శుభం కార్డు వేశాడీ నిత్యపెళ్ళికొడుకు!

  • Loading...

More Telugu News