: ఇకపై కాలేజీల్లో కప్పలు, బొద్దింకలు కోయడం కుదరదంతే!


ఇన్నాళ్ళూ కాలేజీల్లో ప్రాక్టికల్స్ పుణ్యమాని ఎన్నో మూగజీవాలు బలయ్యేవి. ఇప్పుడు వాటికి ఆ భయం అక్కర్లేదని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చెబుతోంది. ఇకపై అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కళాశాలల్లో జంతువులను కోయడంపై యూజీసీ నిషేధం విధించింది. జీవశాస్త్ర కోర్సుల్లో భాగంగా కాలేజీలు, యూనివర్శిటీలు జీవాలను కోసి పరీక్షించడాన్ని (డిసెక్షన్) నిలిపివేయాలని కమిషన్ ఆదేశించింది. "ఏ ఉద్దేశం కోసమైనా గానీ... అటు టీచర్లు, ఇటు విద్యార్థులు ఎవరూ కూడా ప్రాణులను కోయరాదు" అని యూజీసీ స్పష్టంగా పేర్కొంది. యూజీసీ 2011లోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకున్నా అది పాక్షిక నిషేధమే. టీచర్లే కోయాలని, విద్యార్థులు మాత్రం కోయరాదని, కేవలం చూడాలని అప్పట్లో తెలిపింది. అదే సమయంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కాసింత వెసులుబాటు కల్పిస్తూ అరక్షిత జంతువులను మాత్రమే కోయాలని సూచించారు. ఆనాటి పాక్షిక నిషేధానికి సవరణగా తాజా ఉత్తర్వులు జారీచేశారు. ఈ పరీక్షల కోసం ఆయా ప్రాణులను వాటి సహజ ఆవాసాల నుంచి తీసుకువస్తున్న నేపథ్యంలో జీవవైవిధ్యంతో పాటు సమతుల్యత దెబ్బతింటుండడాన్ని యూజీసీ గమనించింది. ఈ నేపథ్యంలోనే తాజా ప్రకటన వెలువడినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News