: దొంగల్ని పట్టించిన లవ్ సింబల్స్!
లవ్ సింబల్స్ ముగ్గురు దొంగలను పోలీసులను పట్టించాయి. హైదరాబాద్ ఎర్రకుంటకి చెందిన ఆటో డ్రైవర్ మహ్మద్ ఆజం, సయ్యద్ వసీముద్దీన్, అబ్దుల్ జావేద్ స్నేహితులు. వీరంతా కలసి ఒకే ఆటోలో తిరుగుతూ, ఒంటరిగా ఎవరైనా తమ ఆటోలో ఎక్కితే చితకబాది దోపిడీ చేస్తుంటారు. ఈ నెల 20న గుంటూరు జిల్లాకు చెందిన కాశీగోపి చాంద్రాయణగుట్టలో వీరి ఆటో ఎక్కి పహాడీషరీఫ్ లో ఉండే తన సోదరుడి ఇంటికి బయలుదేరాడు. అయితే మధ్యలో వీరు ముగ్గురు ఆటోను హఠాత్తుగా దారి మళ్లించి... కాశీగోపి దగ్గర ఉన్న డబ్బు, సెల్ ఫోన్ ను లాక్కొని పారిపోయారు. ఈ ముగ్గురితో జరిగిన పెనుగులాటలో కాశీగోపికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో బాధితుడు కాశీగోపి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఎక్కిన ఆటోపై లవ్ సింబల్స్ ప్రింట్ చేసి ఉన్నాయని కాశీగోపి పోలీసులకు క్లూ ఇచ్చాడు. ఈ క్లూ సహాయంతో పోలీసులు కేవలం మూడు రోజుల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు.