: సోనియాకు కోపం వస్తే రానివ్వండంటున్న సీనియర్ నేత
కాంగ్రెస్ లో ఉండాలో వద్దో తేల్చుకోలేక.. ఓవైపు టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఓపెన్ ఆఫర్ అంగీకరించాలో.. కూడదో అర్థంకాక జుట్టు పీక్కుంటున్న తెలంగాణా నేతల్లో సీనియర్ నాయకుడు కె. కేశవరావు ఒకరు! తెలంగాణ విషయంలో అధిష్ఠానం వైఖరిని బలంగా వ్యతిరేకించే కేకే రాజకీయ భవితవ్యం ఇప్పుడు డోలాయమానంలో పడింది. ప్రత్యేక రాష్ట్రంపై సోనియా స్పష్టమైన సంకేతాలు ఇవ్వకపోవడం, ఇటు ఎలక్షన్లు ముంచుకొస్తుండడం, మరోవైపు కేసీఆర్ దూకుడు.. ఇత్యాది పరిణామాలతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలీక ఆయన సతమతమవుతున్నారు.
ఈ నేపథ్యంలో సోనియాకు కోపం వచ్చినా తెలంగాణపై తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నట్టు కేకే వ్యాఖ్యానించారు. ఇక టీఆర్ఎస్ ను ఉద్యమ పార్టీగా అభివర్ణించిన కేకే.. కేసీఆర్ తనను పార్టీలోకి ఆహ్వానించినట్టు వెల్లడించారు. కేసీఆర్ కోరికను మన్నించడంలో తప్పులేదని కేకే అభిప్రాయం వ్యక్తం చేయడం చూస్తుంటే, ఆయన గులాబీ కండువా ధరించే రోజు మరెంతో దూరంలో లేదనిపిస్తోంది.