: చనిపోయాడనుకున్న వ్యక్తి, పోస్టుమార్టం సమయంలో లేచి కూర్చున్నాడు!


మొన్నటికి మొన్న ఫిలిప్పీన్స్ లో ఓ చిన్నారి బాలిక మరణించి మళ్లీ లేచిందన్న వార్త చూశాం. అయితే అది జరిగిన కొన్ని రోజులకే ఆ బాలిక మరణించింది. తాజా ఘటన మహారాష్ట్రలోని లాతూర్ లో చోటుచేసుకుంది. రైలు నుంచి కిందపడ్డ ఓ 50 ఏళ్ల వ్యక్తి, తీవ్ర గాయాలపాలయ్యాడు. మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఆ వ్యక్తి గాయాలైన నేపథ్యంలో స్పృహ కోల్పోయాడు. దీంతో అతడిని లాతూర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసేందుకు వచ్చిన ఆస్పత్రి వైద్యులు, అతడు మరణించాడని నిర్ధారించారు. స్పృహ కోల్పోయిన అతడి శరీరంలో కదలిక కనిపించని నేపథ్యంలోనే వైద్యులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఇంకేముంది, ప్రమాదానికి గురైన వ్యక్తి మరణిస్తే, పోస్టుమార్టం తప్పనిసరి కదా. లాతూర్ వైద్యులు కూడా అందుకు సన్నాహాలు చేసుకున్నారు. బాధితుడి మృతదేహాన్ని పోస్టుమార్టం గదికీ తరలించారు. కొద్ది క్షణాలుంటే పోస్టుమార్టం ప్రారంభమయ్యేదే. బాధితుడి శరీరం చిధ్రమయ్యేదే. అయితే, ఉన్నట్లుండి బాధితుడి శరీరంలో కదలిక కనిపించింది. దీనిని వైద్యులు గుర్తించలేదు. విధుల్లో ఉన్న ఓ పోలీస్ సబ్ ఇన్ స్పెక్టర్ బాధితుడి శరీరంలో కదలికను గుర్తించి, వైద్యులకు తెలిపారు. దీంతో ఆశ్చర్యానికి గురైన వైద్యులు, సదరు వ్యక్తి మరణించలేదని తాపీగా తేల్చారు. ఆ సబ్ ఇన్ స్పెక్టర్ కూడా ఈ విషయాన్ని గుర్తించకపోయి ఉంటే, రైలు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి నిజంగా చనిపోయేవాడేనేమో. ఇన్ స్పెక్టర్ పుణ్యమాని బతికి బట్టకట్టాడు.

  • Loading...

More Telugu News