: సివిల్స్ అభ్యర్థులకు శ్రీదేవి పాఠాలట!


దేశ అత్యున్నత సర్కారీ ఉద్యోగాలకు సివిల్ సర్వీసుల ద్వారానే ఎంపికవుతున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. నిన్నటిదాకా సివిల్స్ పరీక్షలకు సంబంధించి ప్రిపరేషన్ మినహా, మిగిలిన ఎలాంటి అంశాలపైన చర్చ జరిగేది కాదు. తాజాగా ఈ ఏడాది సివిల్స్ లో ప్రవేశపెట్టిన సీశాట్ పై సర్వత్ర చర్చ నడుస్తుండటమే కాక, దేశవ్యాప్తంగా ఆందోళనలకూ దారితీస్తోంది. సీశాట్, అభ్యర్థుల ఆంగ్ల పరిజ్ఞాన్ని పరీక్షించేందుకేనని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాదిస్తోంది. అయితే సీశాట్ వల్ల పట్టణ ప్రాంత విద్యార్థులకు ప్రయోజనం చేకూరడంతో పాటు గ్రామీణ విద్యార్థుల అవకాశాలను నీరుగార్చే ప్రమాదం ఉందన్న అపోహలు తాజా ఆందోళనలకు దారి తీస్తున్నాయి. దీనిపై అటు ప్రభుత్వంతో పాటు మాజీ సివిల్ సర్వెంట్లు కూడా పరిష్కారం చూపలేని పరిస్థితి నెలకొంది. చివరకు కేంద్రం కూడా దీనిపై దృష్టి సారించినా, ఫలితం మాత్రం శూన్యం. ఇదిలా ఉంటే, అందాల తార శ్రీదేవి, సివిల్స్ అభ్యర్థులకు పాఠాలు చెబుతోందంటూ ఓ వార్తా సంస్థ ఓ కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం, కేవలం ఆంగ్లంలో పరిజ్ఞానం లేదని మధనపడటం మాని అదే బాషలో పట్టు సాధిస్తే సమస్య తీరినట్టే కదా అన్న కోణంలో ఆ కథనం సాగింది. ఇంగ్లిష్ -వింగ్లిష్ చలన చిత్రంలో ఆంగ్లంపై అంతగా అవగాహన లేని శ్రీదేవి పాత్ర శశి, భర్త, పిల్లల నుంచే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు విదేశాలకెళ్లినపుడు బోరున విలపించిన సందర్భాలున్నాయి. అయితే శ్రీదేవి పాత్ర వీటిని ఎలా అధిగమించారన్న కథనంతోనే సదరు చలన చిత్రం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆంగ్లంలో అక్షరం రాని శ్రీదేవి, ఏకంగా విదేశాల్లో అదే బాషలో పాఠాలు చెప్పే స్థాయికి చేరుకున్న వైనాన్ని సివిల్స్ అభ్యర్థులు ఎందుకు ఆదర్శంగా తీసుకోరన్న దానిపైనే సదరు వార్తా సంస్థ బాణం గురిపెట్టింది. అంతగా ఆంగ్లంపై పట్టు లేకపోతే సివిల్ సర్వెంట్ గా ఎలా రాణిస్తారని కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శి నరేశ్ చంద్ర వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కథనం వెలువడింది.

  • Loading...

More Telugu News