: పరువు కోసం భారత్... ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్: నేటి నుంచి నాలుగో టెస్ట్


చారిత్రక ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో నేటి నుంచి భారత్, ఇంగ్లండ్ ల మధ్య నాలుగో టెస్టు జరగనుంది. తొలి మూడు టెస్టుల్లో మొదటిది డ్రా కాగా... రెండో మ్యాచ్ లో భారత్, మూడో మ్యాచ్ లో ఇంగ్లండ్ గెలుపొందాయి. రెండో మ్యాచ్ ముగిసే సమయానికి అత్యంత బలిష్ఠంగా కనిపించిన భారత్... మూడో మ్యాచ్ ముగిసే సరికి చతికిల పడింది. అంతే కాకుండా మూడో మ్యాచ్ విజయంతో ఇంగ్లండ్ కొండంత ఆత్మ విశ్వాసాన్ని కూడగట్టుకుంది. ఈ నేపథ్యంలో, నేడు ప్రారంభం కానున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది. దెబ్బతిన్న పులుల్లా భారత ఆటగాళ్లు సత్తా చాటుతారా? లేక చేతులెత్తేస్తారా? అన్నది ఆట తొలిరోజే తేలిపోనుంది. ఈ మ్యాచ్ లో భారత్ మూడు మార్పులు చేసే అవకాశం ఉంది. ఓపెనర్ గా ధావన్ స్థానంలో గంభీర్ వచ్చే అవకాశం ఉంది. భువనేశ్వర్ గాయం నుంచి కోలుకోనందున అతని స్థానంలో వరుణ్ ఆరోణ్ తుది జట్టులోకి రావచ్చు. ఇషాంత్ స్థానంలో పంకజ్ సింగ్ ను కొనసాగిస్తారా? లేక ఈశ్వర్ పాండేకు అవకాశం ఇస్తారా? అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. మరో వైపు ఇంగ్లండ్ శిబిరం చాలా ఉత్సాహంతో ఉంది. కెప్టెన్ కుక్ ఫాంలోకి రావడంతో, ఆ జట్టు బలం అమాంతం పెరిగింది. అద్భుతమైన ఫాంలో ఉన్న పేసర్ ఆండర్సన్ కు ఓల్డ్ ట్రాఫోర్డ్ సొంత మైదానం కావడంతో... అతడి నుంచి భారత్ కు కష్టాలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఓల్డ్ ట్రాఫోర్డ్ పేసర్లకు పూర్తిగా అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో, ఈ పిచ్ పై పరుగులు రాబట్టడానికి భారత బ్యాట్స్ మెన్ చమటోడ్చాల్సిందే అని విశ్లేషకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News