: ఇకపై 16 ఏళ్ల పైబడ్డ రేపిస్ట్ పెద్దవాడే!


ఇక నుంచి 16 ఏళ్ల పైబడిన రేపిస్ట్ లను పిల్లలుగా ఎంతమాత్రం భావించడానికి కుదరదు. 18 ఏళ్ల వయసు నిండలేదు, కాబట్టి తనను బాలుడిగానే గుర్తించి, అత్యాచారానికి పాల్పడినా, చిన్నపాటి శిక్షతోనే సరిపెట్టాలని కోరే హక్కు ఉండబోదు. ఎందుకంటే, ఈ తరహా నేరస్తులకు ముకుతాడు వేసేందుకు కేంద్ర ప్రభుత్వం, బాల నేరస్తుల చట్టానికి సవరణలు చేసింది. ఢిల్లీ నిర్భయ ఘటనలో పారా మెడికల్ విద్యార్థినిని అత్యంత దారుణంగా అత్యాచారం చేయడంతో పాటు అమానుషంగా గాయాలు చేసిన ఆరుగురిలో ఓ మైనర్ బాలుడు కూడా ఉన్న సంగతి తెలిసిందే. 18 ఏళ్ల వయసు నిండటానికి కేవలం కొన్ని రోజుల గడువు ఉన్న నేపథ్యంలో తాను, బాలుడినని, తనను బాల నేరస్తుడిగా గుర్తించాలని నిందితుడు కోర్టును కోరిన సంగతి తెలిసిందే. వాస్తవానికి నాటి ఘోరంలో బాధితురాలి పట్ల మిగిలిన వారి కంటే ఇతడే పాశవిక దాడికి పాల్పడ్డాడు. అయినప్పటికీ బాల నేరస్తుల చట్టం అమలులో ఉన్న నేపథ్యంలో పోలీసులు గాని, కోర్టు గాని ఏమీ చేయలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే బాల నేరస్తుల చట్టానికి సవరణ చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. బాల నేరస్తుల చట్టానికి తాజాగా జరిగిన సవరణల ప్రకారం, 16-18 మధ్య వయసున్న బాలలు అత్యాచారం, హత్య తదితర నేరాలకు పాల్పడిన నేపథ్యంలో వారిని బాల నేరస్తులుగా పరిగణించబోరు. పెద్దలుగా భావించి, వారిని విచారిస్తారు. ప్రస్తుతం పెద్దలకు ఎలాంటి శిక్షలు అమలు చేస్తున్నారో, వీరికి కూడా అదే తరహా శిక్షలను అమలు చేయనున్నారు. దీనిని అత్యాచారం తరహా నేరాలతో పాటు పసిపిల్లల విక్రయం, మాదక ద్రవ్యాల విక్రయం తదితర నేరాలకూ వర్తింపజేసేందుకు తాజా సవరణలు వీలు కల్పిస్తున్నాయి. దీంతో ఘోరమైన నేరాలకు పాల్పడి, చిన్నపిల్లాడిని కాబట్టి వదిలేయమని అడిగే హక్కు, బాల్యంలోనే క్రూరత్వంగా ప్రవర్తించే వారికి ఇకపై ఉండబోదు.

  • Loading...

More Telugu News