: రుణమాఫీపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు 'షాక్' ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్


ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పంట రుణాల మాఫీ విషయం మళ్లీ మొదటికొచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ప్రకటించిన రుణమాఫీపై ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ నిన్న మండిపడ్డారు. గత ఏడాది ఫై-లిన్ తుపాను వల్ల రెండు రాష్ట్రాల్లోను రుణమాఫీ ప్రకటించాల్సిన స్థాయిలో పంటనష్టం జరగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఫై-లిన్ తుపాను ప్రభావం పెద్దగా లేదని, పంట దిగుబడుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని ఆయన అన్నారు. రుణమాఫీ చేసేంత క్లిష్ట పరిస్థితులు ఈ రెండు రాష్ట్రాల్లో లేవని ఆయన అన్నారు. పై-లిన్ తుపాను వచ్చినప్పుడు... ఈ రెండు జిల్లాల్లో ఒక్క కలెక్టర్ కూడా పంట నష్టపోయినట్లు ప్రకటించలేదని ఆయన పేర్కొన్నారు. అవసరం లేకుండా రుణమాఫీలు చేయడం... అనేక విపరిణామాలకు దారి తీస్తుందని ఆయన ప్రకటించారు. ప్రస్తుతానికి తమ వద్ద ఈ రెండు రాష్ట్రాల్లో రుణమాఫీ చేయడానికి గానీ... రీ షెడ్యూల్ చేయడానికి గానీ నిర్దిష్టమైన విధానమేది లేదని ఆయన అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రెండు రాష్ట్రాల్లో రుణమాఫీ అమలు చేయాల్సి వస్తే... గంపగుత్తగా అన్ని జిల్లాల్లో చేయమని... కేవలం అవసరమైన జిల్లాల్లో మాత్రమే చేస్తామని ఆయన అన్నారు. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రుణమాఫీ హామీని ఇచ్చారని ఆయన అన్నారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వ్యాఖ్యలతో రుణమాఫీని అమలుచేసి తీరతామన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అయోమయంలో పడ్డాయి.

  • Loading...

More Telugu News