: కాంగ్రెస్ కు మరో షాక్... లోక్ సభ ముందు వరుసలో ఆ పార్టీకి రెండు సీట్లే!


కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ప్రజల విశ్వాసం కోల్పోయిన ఆ పార్టీకి లోక్ సభలో ఇప్పటికే ప్రతిపక్ష హోదా దక్కలేదు. ప్రతిపక్ష హోదాకు తాము అర్హులమేనంటూ ఆ పార్టీ గొంతు చించుకున్నా, నిబంధనలు అందుకు విరుద్ధంగా ఉన్నాయంటూ అధికార పక్షం మొండి చెయ్యే చూపింది. ఈ అవమానాన్ని మరిచిపోకముందే, కాంగ్రెస్ కు లోక్ సభ స్పీకర్ మరో షాకిచ్చారు. 44 మంది సభ్యులున్న ఆ పార్టీకి ముందు వరుస బెంచీల్లో కేవలం రెండు సీట్లను మాత్రమే కేటాయిస్తూ స్పీకర్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండింటిలో ఒకదానిలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రెండో దానిలో సభలో పార్టీ నేత మల్లిఖార్జున ఖర్గేలు కూర్చోనున్నారు. తమకు కనీసం నాలుగు సీట్లైనా ముందువరుసలో కేటాయించాలన్న పార్టీ అభ్యర్థనను స్పీకర్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. పార్టీకి లోక్ సభలో ఉన్న సంఖ్యాబలం ఆధారంగానే ముందువరుస సీట్లను కేటాయిస్తామని చెప్పిన స్పీకర్, రెండు సీట్లతో సరిపుచ్చుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇదిలా ఉంటే, సభలో తమను కాంగ్రెస్ పార్టీ సభ్యుల పక్కన కూర్చోబెట్టవద్దంటూ పలు పార్టీలు స్పీకర్ ను వేడుకున్నాయట. వీటిలో వైఎస్సార్సీపీ, తెరాసతో పాటు మరో మూడు పార్టీలున్నాయి. అధికార పక్షానికి తామెంత దూరంగా ఉన్నామో, కాంగ్రెస్ కు కూడా అంతే దూరంలో ఉన్నామని చెబుతూ, తమను కాంగ్రెస్ సభ్యులకు దూరంగా కూర్చునేలా సీట్ల కేటాయింపు ఉండాలని ఆయా పార్టీల సభ్యులు విన్నవించారు. దీంతో సీట్ల కేటాయింపు విషయంలో స్పీకర్ సుమిత్రా మహాజన్ బాగానే శ్రమించాల్సి వచ్చిందని సమాచారం. ఇక వెనుక బెంచీల్లో కూర్చునే కాంగ్రెస్ ఎంపీలు, వామపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ తరహా చిన్నా, చితక పార్టీలకు చెందిన సభ్యులతో బెంచీలు పంచుకుని మరీ ఆసీనులు కావాల్సిందేనట.

  • Loading...

More Telugu News