: ఏపీ రాజధానిగా విజయవాడ-గుంటూరు సురక్షితం కాదా?
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విజయవాడ, గుంటూరు కరెక్టేనా? అంటే కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విజయవాడ భూకంపం జోన్ లో ఉందని, అక్కడ భారీ నిర్మాణాలు ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుంటూరు- విజయవాడ మధ్య ప్రాంతం భూప్రకంపన జోన్ లో ఉందని హైదరాబాద్ లోని భారత భూవిజ్ఞాన శాస్త్ర సంస్థ (జీఎస్ఐ) స్పష్టం చేసింది. నైరుతి గుణదల, మంగళగిరిలోని కొండ ప్రాంతాలు అత్యంత సున్నితమైన ప్రాంతాలని జూన్ లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. ఒక అంతస్థు భవనాలు నిర్మించడానికి కూడా ఈ ప్రాంతం అనువైనది కాదని జీఎస్ఐ స్పష్టం చేసింది. ఇంద్రకీలాద్రి కొండల్లోని తూర్పు ఘాట్ ప్రాంతంతో పాటు నిడమర్రు నైరుతి ప్రాంతం, తాడేపల్లి తూర్పు వైపునున్న దక్షిణ ప్రాంతం, కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో భూకంపాలు సంభవించే అవకాశముందని జీఎస్ఐ తెలిపింది. బెజవాడకు 300 కిలోమీటర్ల రేడియస్ లో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని హైదరాబాద్ ఐఐఐటీ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. కాగా, భూకంపాలు ఎప్పుడు సంభవించే అవకాశం ఉందనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేమని వారు పేర్కొంటున్నారు. దాని తీవ్రతను కూడా ఇప్పుడు అంచనా వేయలేమని, భూకంపం వస్తే తప్ప దాని తీవ్రత గురించి వ్యాఖ్యానించలేమని నిపుణులు వెల్లడిస్తున్నారు. భూకంపాలు వస్తాయని కేంద్రం గుర్తించిన 63 నగరాల జాబితాలో విజయవాడకు స్థానం లభించడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. భూ పొరల్లోని అసమతుల్యత, అపక్రమత కారణంగా సంభవించే మార్పుల వల్ల ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశం ఎక్కువని వారు తెలిపారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం కావడంతో ఇక్కడి భూమిలో నాణ్యత కూడా తక్కువని, అయితే పంటలు పండించేందుకు బ్రహ్మాండంగా పనికి వస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మరి, రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుందో చూడాలి!