: కరీంనగర్ లో రింగు రోడ్డు, నాలుగు లేన్ల రోడ్ ను నిర్మిస్తాం: కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కరీంనగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో మంచినీటి వ్యవస్థ అసమగ్రంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరా అవసరాల కోసం 160 టీఎంసీల నీరు అవసరమవుతుందని ఆయన చెప్పారు. ఈ మంచినీటిని కృష్ణా, గోదావరి నదుల నుంచి తీసుకుంటామని ఆయన తెలిపారు. వచ్చే నాలుగేళ్లలో ఏ పల్లెలోనూ మంచినీటి కొరత లేకుండా చూస్తామన్నారు. ఇందుకోసం లక్ష కిలోమీటర్లలో పైప్ లైన్లు వేస్తామని ఆయన తెలిపారు. కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల నుంచి ఈ పనులు ప్రారంభమవుతాయని ఆయన చెప్పారు. కరీంనగర్ పట్టణానికి ఔటర్ రింగ్ రోడ్డు, నాలుగు లేన్ల రోడ్లను నిర్మిస్తామని అన్నారు. కరీంనగర్ లో ఎల్ఈడీ విద్యుద్దీపాలను ఏర్పాటు చేస్తామని, ఎవరూ ఊహించని రీతిలో కరీంనగర్ పట్టణాన్ని తయారుచేస్తానని చెప్పారు. రాబోయే రోజుల్లో కరీంనగర్ ను టూరిజం కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి తెలిపారు. లోయర్ మానేరులో డిన్నర్ క్రూయిజ్డ్ బోటును ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చెప్పారు.