: మోడీ వల్ల ఆ కుర్రాడు హీరో అయిపోయాడు!
జీత్ ...! నిన్నటి వరకూ ఎవరికీ తెలియని కుర్రాడి పేరిది. అయితే, ప్రధాని నరేంద్ర మోడీ వల్ల ఇప్పుడీ కుర్రాడు రాత్రికి రాత్రే హీరో అయిపోయాడు. చిన్నప్పుడు అన్నతో కలసి ఇండియా వచ్చిన జీత్ కొన్నాళ్లకు నేపాల్ వెళ్లిపోయే క్రమంలో పొరబాటున మరో ట్రైన్ ఎక్కేసి గుజరాత్ చేరాడు. అదే అతని దశను మార్చేసింది. నరేంద్ర మోడీ దృష్టిలో పడేలా చేసింది. జీత్ ను పెంచి, పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పించిన ప్రధాని మోడీ, తన నేపాల్ పర్యటన సందర్భంగా అతని కుటుంబం చెంతకు ఈ కుర్రాడిని చేర్చారు. దీంతో మొన్నటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియని జీత్ బహదూర్ భారత్, నేపాల్ దేశాల్లో సెలబ్రిటీగా మారాడు. నేపాల్ లోని నవల్పారసి జిల్లాలోని సొంతూరు( లోకహ)కి వెళ్లాడు. దీంతో అతని ఇంటికి సందర్శకుల తాకిడి పెరిగిపోయింది. జీత్ ఎలా ఉంటాడోనని చూసేందుకు కొందరు, భారత్ ఎలా ఉంటుందో తెలుసుకుందామని మరి కొందరు అతని నివాసానికి చేరుకుంటున్నారు. మీడియా ప్రతినిధులు అయితే, అతనిని ఇంటర్వ్యూ చేస్తూ, భారత ప్రధాని ఎలా చూసుకున్నారు? ఎంత సన్నిహితంగా ఉంటారు? వంటి ఆసక్తికర అంశాలు తెలుసుకుంటున్నారు. జీత్ అందరితో ముచ్చటిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నాడు. అతడికి ఏ విధమైన ప్రమాదం వాటిల్లకుండా భద్రతా సిబ్బంది సాధారణ దుస్తుల్లో రక్షణ కల్పిస్తున్నారు. వారం తరువాత భారత్ కు తిరిగిరానున్నాడు. తాను ఇంటికి చేరడం పట్ల జీత్ సంతోషంగా ఉన్నాడు. తాను మాట్లాడడం కన్నా ఎదుటి వారి భావాలు తెలుసుకునేందుకే మొగ్గుచూపుతున్నాడని స్థానికులు పేర్కొన్నారు. తన సోదరుడు మోడీతో కలసి వచ్చాడని తెలుసుకున్న సమీప గ్రామాల ప్రజలు తమను చూసేందుకు వస్తున్నారని జీత్ సోదరుడు తెలిపారు. నేపాల్ ప్రజలు నేపాలీ భాషలో ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే జీత్ హిందీలో సమాధానాలిస్తుండడం విశేషం. జీత్ నేపాలీని పూర్తిగా మరచిపోయినట్టున్నాడని స్థానికులు అభిప్రాయపడ్డారు.