: పెళ్లి చేసుకున్నా వదల్లేదు... చివరకు నట్టేట ముంచాడు


ప్రేమ పెళ్లిళ్లలో కొత్త కోణం నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసింది. సినిమాల ప్రభావమో, సమాజం ప్రభావమో కానీ... పదో తరగతిలోనే ప్రేమించానన్నాడు. డిగ్రీ తరువాత లేచిపోదామన్నాడు... ఇంట్లో వాళ్ళు ఆమెకు మరో పెళ్లి చేస్తే ఎడతెగని ఫోన్లతో భర్తను విసిగించి విడాకులు తీసుకునేలా చేశాడు. ఆపై ఆమెను పెళ్లి చేసుకుని వదిలేశాడు. దీంతో అభాగిని అత్తింటి ముందు ఆందోళనకు దిగింది. కలిగోట్ గ్రామానికి చెందిన శిరిష, అశ్వంత్ పదో తరగతిలోనే ప్రేమలో పడ్డారు. ఇంటర్ వరకు ఒకే కాలేజీలో చదివారు. డిగ్రీ పూర్తి కాగానే లేచిపోయారు. మైనర్లు కావడంతో పూజారులు పెళ్లికి నిరాకరించారు. దీంతో తిరిగి ఇళ్లకు చేరారు. 2013లో శిరీషకు తల్లిదండ్రులు బంధువుల అబ్బాయితో పెళ్లి చేశారు. అప్పటి నుంచి శిరీష్ భర్తకు అశ్వంత్ ఫోన్ చేసి తాను లేకపోతే బతకలేనని చెప్పేవాడు. దీంతో అతను నెల తిరక్కుండానే విడాకులిచ్చాడు. గతేడాది అక్టోబరులో స్నేహితుల సాయంతో జాన్కంపేట్ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అనంతరం గ్రామానికి వెళ్లారు. తరువాత కొన్నాళ్లు సంతోషంగానే కాపురం చేశారు. అత్తమామలు కట్నం కోసం చిర్రుబుర్రులాడినా భర్త ఏమనేవాడు కాదు. కానీ వారం క్రితం నిజామాబాద్ బస్టాండ్ కు బైక్ పై తీసుకువచ్చి ఉండమని చెప్పి వెళ్లిపోయాడు. ఎంతసేపటికీ భర్త రాకపోవడంతో ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అంటూ సమాధానం దీంతో తనను వదిలేశాడని అర్ధం చేసుకుంది శిరీష. ఇక తనకు చావే శరణ్యమని బాసరలోని గోదావరి నదిలో దూకుదామని అనుకునేంతలో అటుగా వచ్చిన పోలీసులు గమనించి స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు. కాగా, తనను ఎందుకు వదిలేశాడో తెలపాలని, తన భర్తను తనతో పంపాలని డిమాండ్ చేస్తూ శిరీష్ అత్తింటి ముందు ఆందోళనకు దిగింది.

  • Loading...

More Telugu News