: సచిన్ రాణించినా నెగ్గకపోవడానికి కారణం అదే!: ద్రావిడ్
సచిన్ టెండూల్కర్ స్వార్థపరుడని కొందరు అభిప్రాయపడడాన్ని భారత బ్యాటింగ్ దిగ్గజం రాహుల్ ద్రావిడ్ తప్పుబట్టారు. అలా ఎవరైనా భావిస్తే అది కేవలం అపోహ మాత్రమేనని వ్యాఖ్యానించారు. బ్యాట్స్ మెన్ అన్న తర్వాత సెంచరీలపై దృష్టిపెట్టడం సహజమని, వాళ్ళు పరుగులు సాధిస్తే జట్టు లబ్దిపొందుతుందని వివరించారు. "ఓ ఆటగాడు వంద సెంచరీలు సాధిస్తే, వాటిలో కొన్ని నిరర్థకమైనవి ఉండొచ్చు, కానీ, అదే సమయంలో ఆ వంద శతకాల్లో ఎన్నో భారత క్రికెట్ కి లాభించిన ఇన్నింగ్స్ కూడా ఉండొచ్చు" అని ద్రావిడ్ విశ్లేషించాడు. సచిన్ కూడా మానవమాత్రుడేనని, టెస్టులో ఎన్నో మరపురాని ఇన్నింగ్స్ ఆడినా అవన్నీ మరుగున పడిపోయాయని తెలిపారు. కారణం... సచిన్ బాగా ఆడిన మ్యాచ్ లలో భారత బౌలర్లు పేలవ బౌలింగ్ చేయడంతో ప్రత్యర్థులు నెగ్గారని, తద్వారా సచిన్ ప్రదర్శనలకు విలువ లేకుండా పోయిందని వివరించారు.