: వాళ్ళనంటే ఈయనకు రోషం వచ్చింది!
అప్పుడు ఇందిరా గాంధీని విమర్శించారు, తర్వాత సోనియాను, ఆ తదుపరి రాహుల్ ను విమర్శిస్తున్నారని ఇండియన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ రాజీవ్ సటావా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గాంధీ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు కాంగ్రెస్ ను నిర్వీర్యం చేసేందుకు యత్నిస్తున్నారని సటావా ఆరోపించారు. ఇటీవల నట్వర్ సింగ్ పుస్తకంలో సోనియా, రాహుల్ ప్రస్తావన దేశంలో చర్చనీయాంశం అవడంతో కాంగ్రెస్ వర్గాలు ఎదురుదాడికి దిగాయి. ఈ నేపథ్యంలో సటావా మీడియాతో మాట్లాడుతూ, తమకు సోనియా, రాహుల్ లు అన్ని విషయాల్లో మార్గదర్శకులని విధేయత చాటుకున్నారు. "1977లో షా కమిషన్ సాయంతో ఇందిరా గాంధీని వేధించారు. 1999లో సోనియా స్థానికతను ప్రశ్నించారు. తాజాగా రాహుల్ ను లక్ష్యంగా చేసుకున్నారు. మాపై దాడి జరిగిన ప్రతిసారి దీటుగా ఎదుర్కొని నిలబడ్డాం" అని సటావా వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రతి అంశంపైనా నియంత్రణ కోసం పాకులాడుతోందని ఆయన విమర్శించారు. 'ట్విట్టర్ సర్కారు'లా తయారైందని ఎద్దేవా చేశారు. ఇకపై సామాన్యుడిని ప్రభావితం చేసే ప్రతి అంశంపైనా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.