: స్వాతంత్ర్య దినోత్సవం నాడు మోడీ ప్రాణాలకు ముప్పుంది: ఐబీ హెచ్చరిక


అత్యుత్తమ స్థాయి భద్రతావలయంలో ఉన్నా... స్వాతంత్ర్య దినోత్సవం నాడు భారత ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యంగా ఉగ్రవాదులు విరుచుకుపడే ప్రమాదముందని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ప్రధాని హోదాలో తొలిసారి ఎర్రకోట వద్ద ప్రసంగించనున్న నేపథ్యంలో ఆయన ప్రాణాలకు ముప్పుంటుందన్న విషయాన్ని కొట్టిపారేయలేమని సీనియర్ ఇంటలిజెన్స్ అధికారులు అంటున్నారు. పాకిస్థాన్ సైన్యం అండదండలున్న తీవ్రవాద మూకలు ఈ దాడులకు పాల్పడవచ్చని వారు తెలిపారు. టెర్రరిస్టులు ప్రధానిపై నేరుగా దాడి చేసే అవకాశాలపై నిఘా వర్గాలు ఇప్పటికే భద్రతా యంత్రాంగంతోపాటు హోం మంత్రిత్వ శాఖనూ అప్రమత్తం చేశాయి. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు లష్కరే తోయిబా, సిమి వంటి టెర్రర్ గ్రూపులు దేశ రాజధాని డిల్లీలోని పలు మార్కెట్లు, శివారు ప్రాంతాల్లో బాంబు దాడులకు దిగవచ్చని కూడా నిఘా సంస్థలు అనుమానిస్తున్నాయి. ఉగ్రవాదుల వ్యూహాలను పసిగట్టేందుకు ఇంటలిజెన్స్ బ్యూరోతో పాటు యాంటీ టెర్రర్ విభాగాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. 26/11 తరహాలో విచ్చలవిడిగా కాల్పులు జరిపే అవకాశాలున్నాయని ఓ సీనియర్ ఇంటలిజెన్స్ అధికారి తెలిపారు. అయితే, ప్రధాని మోడీకి కల్పించిన భద్రత రీత్యా టెర్రరిస్టులు ఆయనను సమీపించలేరని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News