: రెచ్చగొట్టడం కాదు... వాస్తవాలు తెలుసుకోండి: దేవినేని ఉమ
ఎంసెట్ కౌన్సిలింగ్ వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు తరువాతైనా తెలంగాణ ప్రభుత్వం కళ్లు తెరవాలని మంత్రి దేవినేని ఉమ అన్నారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కౌన్సిలింగ్ కు ఆటంకాలు కల్పిస్తూ లక్షలాది మంది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడవద్దని సూచించారు. తెలంగాణ రాష్ట్ర నేతలు ప్రజల్లో విద్వేషాలు రగల్చడంలో చూపుతున్న ధ్యాసలో పదో వంతు సమస్యల పరిష్కారంపై పెడితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు. తెలంగాణ నేతలతో పాటు ప్రభుత్వం కూడా రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. ఆర్టికల్ 371 (డి) ప్రకారం విద్యా సంబంధ అంశాలు, అడ్మిషన్లు పదేళ్లపాటు సంయుక్తంగా జరగాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. రాజ్యాంగం మీద గౌరవం ఉంచుకుంటే సమస్యలన్నీ చక్కబడతాయని ఆయన తెలిపారు.