: కేసీఆర్ గారూ! చిన్న సినిమాను బతికించండి: తమ్మారెడ్డి భరద్వాజ
హైదరాబాదులో 2000 ఎకరాల స్థలంలో ఫిల్మ్ సిటీని ఏర్పాటు చేస్తామని ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ... రెండు ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాత తెలంగాణలో సినీ పరిశ్రమ కోసం కేసీఆర్ 2 వేల ఎకరాలను కేటాయించడం సంతోషించదగిన విషయమన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సినీ పరిశ్రమ సమస్యలను ఆయనతో చర్చించానని... చర్చల ఫలితంగా సినిమా సిటీ రావడం ఆనందంగా ఉందన్నారు. అయితే, పరిశ్రమలో నెలకొన్న సమస్యలకు ఇదొక్కటే సమాధానం కాదు అని ఆయన అన్నారు. టిక్కెటింగ్ ను కంప్యూటరైజ్డ్ చేయాలని, దాని వల్ల ప్రభుత్వానికి పన్ను కరెక్టుగా చేరుతుందన్నారు. ఈ విధానం వల్ల నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభం చేకూరుతుందన్నారు. సినిమాలు, టీవీల షూటింగ్ సమయంలో పోలీస్ పర్మిషన్ల సమస్యలు వస్తున్నాయని, ఈ విషయాన్ని కూడా పరిశీలించాలని ఆయన కోరారు. హైదరాబాదు ఫిల్మ్ ఫెస్టివల్ సిస్టమ్ పై పునఃసమీక్ష జరపాలనీ, ఇలాంటి బర్నింగ్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. రోజుకు ఐదు షోలు ఏర్పాటు చేస్తే చిన్న సినిమాల ప్రదర్శనకు వీలు కలుగుతుందని భరద్వాజ చెప్పారు. చెన్నైలో అమ్మా థియేటర్స్ తరహాలో ఇక్కడ కూడా ఒక సిస్టమ్ ను ప్రవేశపెడితే చిన్న సినిమాలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. చిన్న సినిమాలకు పన్ను రాయితీ ఇస్తే ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.