: ఎంసెట్ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్


ఎంసెట్ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 31లోగా ఎంసెట్ కౌన్సిలింగ్ ను పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఉన్నత విద్యామండలిని ఆదేశించింది. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించి ఎలాంటి రాజకీయాలు చేయవద్దని సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. సెప్టెంబర్ మొదటివారంలోగా విద్యార్థులకు తరగతులు ప్రారంభించాలని ఉన్నత విద్యామండలిని సుప్రీం ఆదేశించింది. ఎంసెట్ కౌన్సిలింగ్ కు సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ విషయంలో ఉన్నతవిద్యామండలి విజయం సాధించినట్లైంది. రాష్ట్ర విభజన ప్రభావం విద్యార్థులపై పడకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. స్థానికత నిర్ధారణకు తెలంగాణలో ఫాస్ట్ పథకాన్ని రూపొందిస్తున్నామని... ఈ కమిటీ నివేదిక వచ్చేందుకు మరికాస్త సమయం పట్టే అవకాశం ఉన్నందున కౌన్సిలింగ్ గడువును అక్టోబర్ నెలాఖరు వరకు పెంచాలని తెలంగాణ ప్రభుత్వం తరుపు న్యాయవాదులు వాదించారు. అయితే గడువును అక్టోబర్ నెలాఖరు వరకు ఇవ్వలేమని... అలా చేయడం వల్ల విద్యార్థుల విద్యా సంవత్సరం పాడవుతుందని కోర్టు తేల్చి చెప్పింది. ఆగస్ట్ నెలాఖరులోగా ఫాస్ట్ పథకం మార్గదర్శకాలను రూపొందించుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు సూచించింది. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తెలంగాణ తరపు న్యాయవాదులు కూడా అంగీకరించారు. అడ్మిషన్లపై తమకు ఎలాంటి వ్యతిరేకత లేదని... అయితే ఫీజు రీయింబర్స్ మెంట్ పై తమకు అభ్యంతరాలున్నాయని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుపున వాదించిన హరీష్ సాల్వే సుప్రీంకోర్టుకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News