: వ్యవసాయానికి రోజుకి రెండుగంటల పాటే విద్యుత్... మెదక్ జిల్లా రైతుల ఆందోళన
మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగ్ లో అప్రకటిత విద్యుత్ కోతలకు నిరసనగా వందలాది రైతులు స్థానిక విద్యుత్ ఉపకేంద్రాన్ని ముట్టడించారు. కరెంటు కోతలతో పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రోజుకు కేవలం రెండుగంటల పాటు మాత్రమే విద్యుత్ ను సరఫరా చేస్తున్నారని... ఇలా చేస్తే తమ బతుకులు ఏం కావాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా... విద్యుత్ అధికారుల నుంచి ఏమాత్రం ప్రతిస్పందన లేదని వారు ఆరోపించారు. ఈసారి మాత్రం అధికారులు స్పందించే వరకు తాము ఇక్కడినుంచి కదిలేది లేదని వారు విద్యుత్ ఉపకేంద్రం వద్ద భీష్మించుకుని కూర్చున్నారు.