: ఏషియన్ గేమ్స్ క్రికెట్ టోర్నీకి టీమిండియా దూరం
ఇంచియాన్ ఆసియా క్రీడల సందర్భంగా నిర్వహించే క్రికెట్ టోర్నీలో టీమిండియా పాల్గొనబోవడంలేదని బీసీసీఐ తెలిపింది. బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ తెలిపారు. ఆసియా క్రీడల సమయంలోనే చాంపియన్స్ ట్రోఫీ జరగనుందని వెల్లడించారు. కాగా, 17వ ఆసియా క్రీడలు దక్షిణకొరియాలోని ఇంచియాన్ లో జరగనున్నాయి. ఆసియా క్రీడలకు దక్షిణకొరియా ఆతిథ్యమివ్వడం ఇది మూడోసారి. 1986 లో సియోల్, 2002లో బుసాన్ వేదికగా ఈ క్రీడలు నిర్వహించారు. కాగా, చైనాలో జరిగిన గత ఆసియా క్రీడల సందర్భంగా క్రికెట్ క్రీడాంశాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టారు. అప్పుడు కూడా భారత్ జట్టు హాజరుకాలేదు. ఈసారి టోర్నీకి పాకిస్థాన్ జట్టు కేవలం మహిళల జట్టునే పంపుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ మాత్రం పురుషుల, మహిళల జట్లను పంపాలని నిర్ణయించుకున్నాయి. ఆసియా క్రీడల్లో భాగంగా క్రికెట్ టోర్నీ సెప్టెంబర్ 20 నుంచి అక్టోబర్ 3 వరకు జరుగుతాయి. ఈ టోర్నీ పురుషుల విభాగంలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్, దక్షిణకొరియా, చైనా, నేపాల్, మలేసియా, మాల్దీవులు, కువైట్ తలపడతాయి. మహిళల విభాగంలో పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, చైనా, హాంకాంగ్, దక్షిణకొరియా, జపాన్, మలేసియా, నేపాల్, థాయ్ లాండ్ జట్లు పోటీపడనున్నాయి.