: ఫేస్ బుక్ నిలిచిపోయిందని పోలీసులకు కాల్ చేశారు!
నెటిజన్ల జీవితాలతో సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ ఎంతలా పెనవేసుకుపోయిందో తెలిపేందుకు ఇంతకంటే నిదర్శనం మరొకటి ఉండదు. అమెరికాలో ఇటీవల కొద్దిసేపు ఈ సోషల్ నెట్ వర్క్ సేవలు నిలిచిపోయాయి. ఫేస్ బుక్ ఓపెన్ కాకపోవడంతో వేలాది మంది ఖాతాదారులు ఉక్కిరిబిక్కిరైపోయారట. దీంతో, కొందరు ట్విట్టర్ లో తమ బాధను వెళ్ళగక్కారు. ఫేస్ బుక్ లేకపోతే ఎలా గడపడం..? అని కొందరు ట్వీట్ చేశారు. ఆలస్యాన్ని తట్టుకోలేకపోయిన మరికొందరు ఏకంగా పోలీస్ డిపార్ట్ మెంట్ కు ఫోన్లు చేశారు. డిపార్ట్ మెంట్ కు చెందిన ఎమర్జెన్సీ, నాన్-ఎమర్జెన్సీ నంబర్లన్నంటికీ కాల్ చేశారట. దీంతో, పోలీసు వారు ప్రత్యేకంగా ట్వీట్ చేయాల్సి వచ్చింది. ఫేస్ బుక్ నిలిచిపోవడం అనేది లా ఎన్ ఫోర్స్ మెంట్ కు సంబంధించిన అంశం కాదని, దయచేసి తమకు ఈ విషయమై ఫోన్లు చేయవద్దని ట్విట్టర్ లో పేర్కొన్నారు. దీనిపై ఫేస్ బుక్ స్పందిస్తూ, జరిగిన అంతరాయానికి చింతిస్తున్నామని తెలిపింది. సాంకేతిక లోపం కారణంగానే సేవలు తాత్కాలికంగా నిలిచిపోయాయని తెలిపింది.