: క్రికెట్ పక్కనబెట్టి తుపాకులందుకున్నారు!


ఇజ్రాయెల్ సైన్యం తీవ్రవాదంపై సాగిస్తున్న పోరులో ఇద్దరు క్రికెటర్లు సైతం పాలుపంచుకుంటున్నారు. వారిద్దరూ భారతీయ సంతతికి చెందిన సోదరులు కావడం విశేషం. షిఫ్రాన్ వాస్కర్, రోనెన్ వాస్కర్... ఈ యువకులిద్దరూ ఇజ్రాయెల్ జాతీయ జట్టు క్రికెటర్లు. 20 ఏళ్ళ షిఫ్రాన్ పేస్ బౌలర్ కాగా, రోనెన్ (26) లెగ్ స్పిన్నర్. వీరిద్దరూ ఇజ్రాయెల్ దేశవాళీ క్రికెట్ కోసం సన్నద్ధమవుతుండగా, హమాస్ తో పోరు వీరి సన్నాహాలకు ఆటంకం కలిగించింది. ఆర్మీ పిలుపుతో మరేమీ ఆలోచించకుండా తమకిష్టమైన క్రీడను పక్కనబెట్టి, తుపాకులందుకుని కదనక్షేత్రంలోకి ఉరికారు. వీరి కుటుంబం 90వ దశకంలో ముంబయి నుంచి ఇజ్రాయెల్ వలస వెళ్ళింది. కాగా, రోనెన్ మీడియాతో మాట్లాడుతూ, తాము క్రికెట్, ఆర్మీ రెండింటినీ ఇష్టపడతామని తెలిపాడు. ప్రస్తుతం హమాస్ మిలిటెంట్లు రాకెట్లతో దాడులు చేస్తున్న నేపథ్యంలో అక్కడి క్రికెట్ లీగ్ వాయిదా పడింది. ప్రస్తుతం తాను యుద్ధరంగానికి దగ్గర్లోనే విధులు నిర్వర్తిస్తున్నాని, త్వరలోనే క్రికెట్ లీగ్ ప్రారంభమవుతుందని రోనెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు. షిఫ్రాన్ గాజాలో పోరాడుతున్నాడని చెప్పిన రోనెన్, ప్రతి ఇజ్రాయెల్ పౌరుడికి సైనిక శిక్షణ తప్పనిసరిగా ఇస్తారని తెలిపాడు. తాము ప్రతిరోజు క్రికెట్ ఆడబోమని, ఎక్కువ సమయం సైనిక శిక్షణలో గడుపుతామని పేర్కొన్నాడు. 1979 నుంచి ఇజ్రాయెల్ ఐసీీసీ అనుబంధ సభ్య దేశంగా కొనసాగుతోంది. కాగా, ఇజ్రాయెల్ లో భారత సంతతి క్రికెటర్ల ప్రాబల్యంపై మాజీ అంపైర్ గుడ్కర్ మాట్లాడుతూ, ఇజ్రాయెల్ క్రికెట్ పై భారత సంతతి క్రికెటర్లు తమదైన ముద్రవేశారని అన్నారు. భారత్ నుంచి వచ్చి ఇక్కడి క్రికెట్ టీమ్ లో స్థానం సంపాదించినవాళ్ళు చాలామంది ఉన్నారని, జాతీయ జట్టు కెప్టెన్ ఎష్కోల్ సాల్మన్ కూడా ముంబయిలో జన్మించినవాడేనని గుడ్కర్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News