: కర్ణాటకలో అత్యాచార పరీక్ష విధానంలో మార్పు
అత్యాచార నిర్థారణకు చేస్తున్న పరీక్షా విధానంలో మార్పు తీసుకొచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వం నడుం బిగించింది. అత్యాచార బాధిత మహిళలకు ప్రస్తుతం చేస్తున్న పరీక్షా విధానంలో మార్పు చేస్తూ నిపుణులైన ముగ్గురు వైద్యులు గల సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని నియమించిందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. అలాగే, అత్యాచార బాధిత మహిళలకు స్వాంతన చేకూర్చే ఇంటిగ్రేటెడ్ సెంటర్లను జిల్లాకొకటి చొప్పున ఏర్పాటు చేయనున్నామని మరో మంత్రి ఉమాశ్రీ తెలిపారు. బెంగళూరులో మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు పెరిగిపోతుండడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ బంద్ చేపట్టారు. ఈ బంద్ లో స్వచ్చంద సంస్థల కార్యకర్తలు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, పట్టణవాసులు భారీసంఖ్యలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. కాగా, దేశ రాజధాని ఢిల్లీ తరువాత బెంగళూరులోనే బాలికల పైన, మహిళల పైన అత్యాచారాలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే.