: తల్లంటే ఆమె... కుమార్తెను కిడ్నాప్ కాకుండా కాపాడుకోగలిగింది!


బిడ్డల పట్ల ఓ తల్లి ఎంత అప్రమత్తంగా ఉండాలన్నది ఆమెను చూస్తే తెలుస్తుంది. బిడ్డలను కాపాడుకునేందుకు ఆమె చూపిన వివేకం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. స్కూలుకి వెళ్తున్న పిల్లలు కిడ్నాప్ కు గురయ్యారంటూ వార్తల్లో విన్న ప్రతిసారి మనం బాధపడతాం... ఆ తరువాత మర్చిపోతాం. కానీ, ఆ తల్లి అలా చేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో తన కుమార్తెకు నేర్పింది. ఆ కుమార్తె తల్లి చెప్పిన మాటలను తూచ తప్పకుండా పాటించడంతో కిడ్నాప్ బారిన పడకుండా తప్పించుకోగలిగింది. వివరాల్లోకి వెలితే... ఢిల్లీలోని లిటిల్ ఫ్లవర్స్ స్కూలుకు ఓ ఆగంతుకుడు వెళ్లి ‘అర్జెంట్ గా నిన్ను తీసుకురమ్మని మీ అమ్మ నన్ను పంపించింది’ అంటూ ఎనిమిదేళ్ల పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అతడిని చూసిన బాలిక బెదరకుండా, ‘మా అమ్మ పంపించిందా? అయితే పాస్ వర్డ్ చెప్పు’ అని అడిగిందట. దీంతో పాస్ వర్డ్ ఏంటో తెలియని కిడ్నాపర్ కంగారుపడి అక్కడి నుంచి జారుకున్నారట. కిడ్నాపర్ల బారిన పడకుండా తల్లి, కూతుళ్లు ఓ పాస్ వర్డ్ ను పెట్టుకున్నారట. ఎవరైనా తనతో రమ్మని అడిగితే పాస్ వర్డ్ చెప్పమని అడగాలని కూతురుకు తల్లి చెప్పిందట. పాస్ వర్డ్ చెబితేనే వారితో ఇంటికి రావాలని తల్లి బాలికకు జాగ్రత్త చెప్పిందట. దీంతో బాలిక ధైర్యంగా పాస్ వర్డ్ అడగడం... కిడ్నాపర్ పరారవ్వడం జరిగింది. దీనిని తెలుసుకున్న స్కూలు యాజమాన్యం ఆ తల్లి జాగ్రత్తను ప్రశంసిస్తూ ఓ లేఖను ప్రకటన రూపంలో వెల్లడించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ లెటర్ నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఏదైనా జరగకూడనిది జరిగితే పోలీసులను, సెక్యూరిటీ సిబ్బంది, ఇతరులను నిందించకుండా తల్లిదండ్రులు కూడా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని నెటిజన్లు తల్లీకూతుర్లను అభినందిస్తున్నారు.

  • Loading...

More Telugu News