: కలిస్ కు ఐసీసీ కితాబు
జాక్వెస్ కలిస్..! ఎన్నో ఏళ్ళుగా అంతర్జాతీయ క్రికెట్ మైదానాలు ఈ భారీకాయుడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ తో మురిసిపోయాయి. మైదానంలో ఇక, ఆ బ్యాటింగ్ ఒరవడి కనిపించదు, ఆ బౌలింగ్ రనప్ సవ్వడీ వినిపించదు. ఈ విషయం తలుచుకుంటే గుండె బరువెక్కని క్రికెట్ అభిమాని ఉండకపోవచ్చు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు కలిస్ బుధవారం ప్రకటించగానే అందరూ విచారం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత ఆల్ రౌండర్ క్రికెట్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నేడు స్పందించింది. ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవ్ రిచర్డ్సన్ ఓ ప్రకటన చేస్తూ, అన్ని ఫార్మాట్లలోనూ కలిస్ స్థిరత్వానికి ప్రతీకలా నిలిచిపోతాడని కొనియాడారు. క్రికెట్ చరిత్రలోనే అతనో అద్భుతమైన ఆల్ రౌండర్ అని పేర్కొన్నారు. 20 ఏళ్ళ వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ప్రవేశించి అనతికాలంలోనే దక్షిణాఫ్రికా జట్టుకు మూలస్తంభంలా మారాడని అన్నారు. కాగా, మూడు ఫార్మాట్లు కలుపుకుని కలిస్ 519 అంతర్జాతీయ మ్యాచ్ లాడి 25,534 పరుగులు చేశాడు. వాటిలో 62 సెంచరీలున్నాయి. బౌలింగ్ లో 577 వికెట్లు తీయడం విశేషం. ఫీల్డింగ్ లోనూ తన సత్తా చాటుతూ 338 క్యాచ్ లు అందుకున్నాడు. ఇటీవలి శ్రీలంక పర్యటన కలిస్ కు చేదు అనుభవాలు మిగిల్చింది. మూడు వన్డేల్లో కలిపి ఐదే పరుగులు చేయడంతో కలిస్ క్రికెట్ నుంచి తప్పుకోవడమే మేలని భావించినట్టు సమాచారం.