: అమెరికా అణు మీట నొక్కేదెవరో తెలుసా?
అణుబాంబు ప్రయోగించే అధికారం ఆయా దేశాల అధినేతల వద్దే ఉంటుంది. అగ్రరాజ్యం అమెరికా అయినా అదే పరిస్థితి. కానీ, అధినేత ఆదేశాలు మాత్రమే జారీచేస్తాడు, మరి మీట నొక్కేదెవరు? అంటే, లెఫ్టినెంట్ ర్యాంకు, ఆపై స్థాయి అధికారులేనట. ప్రస్తుతం అమెరికాలో అణు బటన్ నొక్కే బాధ్యతలు ఓ భారత సంతతి అధికారి నిర్వర్తిస్తుండడం విశేషం. ఆయన పేరు రాజ్ బన్సల్. అమెరికా ఎయిర్ ఫోర్స్ 90వ మిస్సైల్ వింగ్ లో లెఫ్టినెంట్ గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజ్ కాకుండా కెప్టెన్ జేమ్స్ షానన్ కూడా ఈ అణు ప్రోగ్రామ్ లో నియమితులయ్యారు. కాగా, ఈ అణు ప్రోగ్రామ్ కోసం 10 మినిట్ మాన్-3 అణు మిస్సైళ్ళను సిద్ధంగా ఉంచారు. వీటిని చియెన్నే, వ్యోమింగ్, లింకన్, నెబ్రాస్కా ప్రాంతాల మధ్య ఓ బంకర్ లో దాచి ఉంచారు. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ప్రత్యేక కోడ్ తో వీటిని లక్ష్యం దిశగా ప్రయోగిస్తారు. ఇదిలావుంటే, ఈ బాధ్యతలు చేపట్టే అర్హతలున్న అధికారుల కోసం అమెరికా వాయుసేన ఓ పరీక్ష నిర్వహించగా, పలువురు చీటింగ్ కు పాల్పడ్డారట. ఈ స్కాం బట్టబయలు కావడంతో తొమ్మిది మందిని సస్పెండ్ చేయగా, మరో డజను మందిని మందలించి వదిలిపెట్టారు.