: రుణమాఫీ సాధ్యంకాదని బాబుకి తెలీదా?... జగన్ ఎలా కలిసి రమ్మంటున్నారు?: ఆనం
రుణమాఫీ సాధ్యం కాదని 9 ఏళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన చంద్రబాబునాయుడుకి తెలియదా? అని కాంగ్రెస్ సీనియర్ నేత ఆనం వివేకానందరెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, శ్వేత పత్రాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు హడావుడి చేస్తున్నారని మండిపడ్డారు. పరిపాలన చేతకాక, ఇచ్చిన హామీలు నెరవేర్చే ధైర్యం లేక గత ప్రభుత్వం తప్పులు చేసిందని బాబు చెబుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే వాటిని రద్దు చేసి, కొత్త నిర్ణయాలు తీసుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాలని ఆయన సూచించారు. ఆర్బీఐ నిబంధనల ప్రకారం మన రాష్ట్రం రుణాల రీషెడ్యూలుకు అర్హత సాధించదని ఆయన అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రావాలనే తొందర్లో పెద్దపెద్ద హామీలు ఇచ్చి ఇప్పుడు తలపట్టుకుంటున్నారని ఆయన తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు నిండకుండానే విమర్శలు అవసరమా? అని వైఎస్సార్సీపీ అధినేత జగన్ కు ఆయన హితవు పలికారు. పరిపాలన ఎలా ఉండబోతుంది? అనే స్పష్టత రాకుండానే ‘ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసిరావాలి... ఆందోళన చేస్తాం’ అంటే తాము సహకరించడానికి సిద్ధంగా లేమని ఆయన స్పష్టం చేశారు. అంతగా ఆందోళన చేయాలని ఉంటే హైదరాబాదులోని ట్యాంక్ బండ్ మీద ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇవ్వాలంటూ ఆందోళన చేయాలని జగన్ కు ఆయన సూచించారు.