: లోక్ సభలో కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా హుళక్కే!


మూలిగే నక్కపై తాటికాయ పడటమంటే, ఇదేనేమో! అసలే ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ కు, లోక్ సభలో ప్రతిపక్ష హోదా అయినా దక్కితే బాగుంటుందన్న భావన ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అందుకే కాబోలు, నేల విడిచి సాము చేస్తున్న ఆ పార్టీ అతిరథ మహారథులు చేయని యత్నం లేదు. ఏకంగా సోనియాగాంధీనే ఈ విషయంపై నోరు విప్పారు. అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉన్న తమ పార్టీకి ప్రతిపక్ష నేత పదవి ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. ఒకానొక దశలో కోర్టుకు కూడా వెళ్లేందుకు ఆమె సిద్ధపడ్డారు. అనవసర రాద్దాంతం ఎందుకు, మన పార్టీ కూడా గతంలో ఇలాగే విపక్షాలను ఆడుకుందంటూ పార్టీ సీనియర్లు చెప్పడంతో కోర్టు యత్నాన్ని వదులుకున్నారు. అసలు విషయమేమిటంటే, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వబోమంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ పరోక్షంగా వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె, ప్రతిపక్ష హోదా పొందేందుకు కాంగ్రెస్ కు అర్హత లేదని తేల్చిచెప్పారు. ఈ విషయంలో తాను అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని అనుసరించి నిర్ణయం తీసుకోనున్నట్లు మహాజన్ ప్రకటించారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, ఇప్పటికే కాంగ్రెస్ వాదనలను కొట్టిపారేశారు. 10 శాతం మంది సభ్యుల బలం లేకుండా కాంగ్రెస్ పార్టీ సభలో ప్రతిపక్ష హోదా పొందడానికి అర్హురాలు కాదని ఆయన తన అభిప్రాయాన్ని సర్కారుకు తేటతెల్లం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సుమిత్ర మహాజన్ కూడా, గతంలో 10 శాతం కంటే తక్కువ సభ్యులున్న ఏ పార్టీలకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదన్న విషయాన్ని ప్రస్తావించారు. అంతటితో ఆగని ఆమె, విపక్షాలకు తగిన బలం లేని కారణంగా 1969 దాకా అసలు ప్రతిపక్ష నేత లేకుండానే లోక్ సభ కొనసాగిన విషయంతో పాటు 1980, 1984 లలోనూ లోక్ సభలో ప్రతిపక్ష నేత లేరని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా ఇచ్చే అంశంపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటానని చెప్పిన ఆమె, ఈ విషయాలన్నింటినీ వల్లె వేస్తున్నారంటే, కాంగ్రెస్ కు భంగపాటు తప్పదని చెప్పడమే కదా.

  • Loading...

More Telugu News