: ఆపదమొక్కులవాడి దగ్గర ఆపద కలిగితే... గోవిందా అంటూ కొండ దిగాల్సిందే!


తిరుమల శ్రీవేంకటేశ్వరుడికి ఆపద మొక్కులవాడని పేరుంది. అయితే ఆయన కొలువై ఉన్న తిరుమలలో భక్తులకు ఏ చిన్న ఆపద, అనారోగ్యం కలిగినా... ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండ దిగి తిరుపతికి వెళ్లాల్సిందే. ఇటీవల తిరుమలలో వెంకన్న దర్శనం కోసం క్యూలైన్లో నిలుచున్న ఇద్దరు భక్తులను పాము కాటు వేసింది. వీరిని తిరుమల ఆశ్విని ఆసుపత్రికి తరలిస్తే అక్కడ పాముకాటుకు విరుగుడు మందైన యాంటీవీనం లభించలేదు. తిరుపతిలోని రుయా ఆసుపత్రికి వెళ్లేంతవరకు ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని బాధితులు, వారి బంధువులు పరుగులు తీశారు. ఇలా ప్రతి చిన్నవిషయానికి తిరుపతికి పంపించడం తప్ప, కొండపై సరైన వైద్యసేవలు అందడం లేదని భక్తులు వాపోతున్నారు. తిరుమల కొండపై విష్ణు నివాసం, శ్రీనివాసం అతిథి గృహం వద్ద రెండు డిస్పెన్సరీలున్నాయి. వీటితో పాటు వైకుంఠం 1, 2 క్యూకాంప్లెక్సుల వద్ద, డి టైప్ క్వార్టర్స్ వద్ద ఆసుపత్రులున్నాయి. వీటితో పాటు అశ్విని ఆసుపత్రి, టిటిడి పాలనావిభాగం దగ్గర సెంట్రల్ ఆసుపత్రి ఉన్నాయి. అయితే ఇన్ని ఆసుపత్రులు ఉన్నా వీటిలో పారాసిటమాల్ ట్యాబ్లెట్లు తప్ప... బి.పి, షుగర్ మందులు కూడా ఉండవు. ఇలా అని ఈ ఆసుపత్రులకు మందుల సరఫరా లేదా అంటే... అది అబద్ధమే అవుతుంది. ప్రతీ ఏడాది సంవత్సరానికి అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ మొత్తం టీటీడీ ఆసుపత్రులకు మందులు సరఫరా అవుతాయి. అయితే వీటిని అక్కడా స్థానికంగా నివసిస్తున్నవారు లెక్కా పత్రం లేకుండా తీసుకుండడంతో...మందుల స్టాక్ వచ్చిన కొన్ని నెలలకే ఖాళీ అయిపోతోంది. ఇక పై ఓ లెక్కప్రకారం పేర్లు కంప్యూటర్లో నమోదు చేసుకుని స్థానికంగా ఉన్నవారికి మందులు సరఫరా చేయాలని భక్తులు కోరుతున్నారు. తిరుమలకు ఏటా సుమారు 2,500 కోట్ల ఆదాయం ఉంది. అయినా భక్తులకు కనీస ఆసుపత్రి సౌకర్యాలు కల్పించకపోవడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News