: లష్కరే ముష్కరుడి అరెస్ట్


లష్కరే తోయిబా కు చెందిన ఒక ఉగ్రవాదిని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లష్కరే తోయిబాలో యువత చేరేలా కీలక భూమిక పోషిస్తున్నాడని భావిస్తున్న అబ్దుల్ సుభాన్, రాజస్థాన్, హర్యానా, బీహార్ లలో తన కార్యకలాపాలు సాగించినట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న అనుమానంతో ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ సాగించిన క్రమంలో సుభాన్ పేరు వెలుగు చూసింది. తమతో పాటు పెద్ద సంఖ్యలో యువతను లష్కరే తోయిబా వైపు తిప్పేందుకు సుభాన్ యత్నిస్తున్న విషయాన్ని సదరు యువకులు పోలీసులకు కూలంకషంగా వివరించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు, వారం క్రితం, ఢిల్లీలోని సరాయి కాలేఖాన్ బస్ స్టాండ్ వద్ద వలపన్ని పట్టుకున్నారు. హర్యానాలోని మేవాట్ జిల్లా గుమాత్ బిహారీ గ్రామానికి చెందిన సుభాన్, లష్కరేకు యువకులను అందించే కీలక భూమిక పోషిస్తున్నట్లు పోలీసులు ఓ అంచనాకు వచ్చారు. గతంలోనూ ఇతడిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆర్డీఎక్స్ తో పాటు ఏకే 56, పిస్టళ్లు, డిటోనేర్లు, టైమర్లు తదితర ఆయుధాలను గుజరాత్ లోని పఠాన్ జిల్లాకు తరలిస్తున్న క్రమంలో అరెస్టైన ఇతడు, పదేళ్ల జైలు శిక్షకు గురయ్యాడు. అయితే జైలులో సత్ప్రవర్తన నేపథ్యంలో ఎనిమిదేళ్ల శిక్ష పూర్తి కాగానే 2010లో విడుదలయ్యాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కూడా సుభాన్, తన ఉగ్రవాద కార్యకలాపాలకు స్వస్తి చెప్పకపోగా మరింత విస్తృతం చేశాడు. ఈ దఫా మరింత కీలకమైన నియామకాల పనిని చేపట్టాడు. లష్కరే తోయిబా అగ్రనేతలతోనూ సుభాన్ కు నేరుగా మాట్లాడే స్థాయిలో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. విచారణలో భాగంగా మరింత సమాచారం వెలుగు చూసే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News