: మొబైల్ నెట్ యూజర్లకు ఫేస్ బుక్ కొత్త ఆప్షన్ తో గాలం
మొబైల్ లో నెట్ వాడే వినియోగదారులకు కొత్త సౌకర్యంతో గాలమేసేందుకు ఫేస్ బుక్ రంగం సిద్ధం చేస్తోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వినియోగం తగ్గుతుండడానికి తోడు... భారతదేశంలో ఫేస్ బుక్ వినియోగం పెరుగుతుండడంతో కొత్త సౌకర్యంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ సరికొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తేనుంది. మొబైల్ లో ఫేస్ బుక్ వినియోగిస్తున్నా కావాల్సిన వాటిని సేవ్ చేసుకునే ఆప్షన్ లేకపోవడంతో ఫోన్ కంటే కంప్యూటర్ పైనే ఎక్కువ మంది ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. దీంతో ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్లలో ఫేస్‌బుక్ ను ఉపయోగిస్తుంటే ఇక నుంచి ‘సేవ్’ అనే కొత్త ఆప్షన్ కనిపిస్తుంది. సినిమాలు, పాటలు, టీవీ షోల వంటి వాటిని వినియోగదారులకు వీలు కుదిరినప్పుడు చూసుకునే విధంగా వాటి లింకుల్ని ఈ ఆప్షన్ ద్వారా సేవ్ చేసుకోవచ్చు. తరువాత విరామ సమయాల్లో వాటిని ఎంచక్కా వీక్షించవచ్చు. అలా సేవ్ చేసుకున్న లింకులు మీకు తప్ప ఇంకెవరికీ కనిపించకుండా ఉండేలా దానిని ఫేస్ బుక్ రూపొందించనుంది. అలా కాదనుకుంటే ఆ లింకులను ఆర్చీవ్ లో సేవ్ చేసుకోవచ్చు, లేదా స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు. ఈ ఆప్షనును అతిత్వరలోనే అందుబాటులోకి తేనున్నట్టు ఫేస్ బుక్ స్పష్టం తెలిపింది. అలా సేవ్ చేసుకున్న లింక్స్ ను చూడాలంటే ఎడమవైపున ఉన్న ట్యాబ్ ను క్లిక్ చేస్తే సరిపోతుంది.