: కొత్త కాంట్రాక్టు దక్కించుకున్న కేపీ
స్టార్ బ్యాట్స్ మన్ కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ జట్టులో చోటు కోల్పోయాక ఐపీఎల్ లో మాత్రమే కనిపించాడు. తాజాగా, ఆస్ట్రేలియన్ బిగ్ బాష్ లీగ్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ లీగ్ లో కేపీ మెల్బోర్న్ స్టార్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. మెల్బోర్న్ జట్టుకు రెండేళ్ళపాటు ఆడేందుకు కాంట్రాక్టు కుదిరింది. దీనిపై కేపీ మాట్లాడుతూ, స్టార్లతో కూడిన మెల్బోర్న్ జట్టుకు ఆడనుండడంపై హర్షం వ్యక్తం చేశాడు. అన్నిటికంటే ముఖ్యంగా సుప్రసిద్ధ ఎంసీజీ మైదానం తమ జట్టు సొంతగడ్డ అన్న విషయం మర్చిపోరాదని తెలిపాడు. ఈ ఏడాది చివర్లో డిసెంబర్ 20న హోబర్ట్ హరికేన్స్ తో జరిగే మ్యాచ్ తో మెల్బోర్న్ స్టార్స్ జట్టు బిగ్ బాష్ తాజా సీజన్ ను ఆరంభిస్తుంది. కాగా, కేపీతో కాంట్రాక్టుపై మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ కామెరాన్ వైట్ మాట్లాడుతూ, అతని కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామని తెలిపాడు. కేపీ చేరికతో జట్టు బలోపేతం అవుతుందని అన్నాడు. కాగా, ఈ దక్షిణాఫ్రికా జాతీయుడు ప్రస్తుతం కరీబియన్ ప్రీమియర్ లీగ్ లో సెయింట్ లూసియా జౌక్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.