: ఉద్యోగులకు వెంకయ్యనాయుడి క్లాస్
కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు నిర్మాణ్ భవన్ ఉద్యోగులకు క్లాస్ తీసుకున్నారు. ఢిల్లీలోని నిర్మాణ్ భవన్ ఉద్యోగులు విధులకు ఆలస్యంగా హాజరవుతూ... విధులను అలక్ష్యం చేస్తున్నారనే ఫిర్యాదులు కేంద్ర మంత్రికి అందుతున్నాయి. ఉద్యోగులు తమ పొరపాట్లను సరిదిద్దుకోవాలని గతంలో సందర్శించినప్పుడు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పొరబాట్లు సర్దుకుంటారని చూసిన ఆయన... భవన్ లోని అన్ని విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. దీంతో చాలా సీట్లు ఖాళీగా కనిపించాయి. ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులందర్నీ వెంకయ్య పిలిచి హెచ్చరించారు. విధుల నిర్వహణలో అలసత్వం సరికాదని ఆయన సూచించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.