: వర్షం పడితే... స్కూల్ బస్సులు నడపం: ముంబై స్కూల్ బస్ యజమానులు


ముంబై నగరంలో భారీ వర్షాలు కురిసినప్పుడు ఇకపై తాము బస్సులు నడపమని ముంబై స్కూల్ బస్ ఓనర్స్ అసోసియేషన్ (ఎస్‌బీఓఏ) స్పష్టం చేసింది. ముంబై స్కూల్ విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని అసోషియేషన్ స్పష్టం చేసింది. వర్షాలు పడినప్పుడు రోడ్లపై భారీగా నీరు నిలిచిపోతుందని... దీనివల్ల తమ బస్సులు బ్రేక్ డౌన్ అవుతున్నాయని బస్ ఓనర్స్ అంటున్నారు. వర్షం పడినప్పుడు ఏ ప్రాంతాల్లో నీటి నిల్వలు ఎక్కువగా ఉంటాయో, ఏ రోడ్లపై గుంతలు ఎక్కువగా ఏర్పడతాయో ఆయా ప్రాంతాల్లోని పాఠశాలకు బస్సులను నడపబోమని ఎస్‌బీఓఏ స్పష్టం చేసింది. ప్రమాదాలను నివారించే ముఖ్య ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎస్‌బీఓఏ ప్రతినిధులు అంటున్నారు. ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం కూడా అందజేస్తామని పేర్కొన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతోపాటు బీఎంసీ కార్పొరేషన్ కూడా రోడ్లపై ఏర్పడిన గుంతలను ఏమాత్రం బాగుచేయకుండా... పిల్లల జీవితాలతో ఆడుకుంటోందని ఎస్‌బీఓఏ అధ్యక్షుడు అనిల్ గార్గ్ ధ్వజమెత్తారు. అంతేకాకుండా పాఠశాల బస్సుల్లో విద్యార్థులను ఎక్కించుకొని గుంతలు ఏర్పడిన రోడ్లపై వెళ్లడం వల్ల వీటి నిర్వహణకు అయ్యే ఖర్చు మామూలు రోజుల కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువ అవుతోందని ఆయన తెలిపారు. ఏ చిన్న ప్రమాదం సంభవించినా అందుకు బస్సు యజమానులు, డ్రైవర్లనే బాధ్యులు చేస్తారని... రోడ్లపై ఏర్పడిన గుంతలపై కార్పొరేషన్ అధికారులను ప్రజలు నిలదీయరని ఆరోపించారు. ఇదిలా వుండగా, తమకు ఈ విషయమై ఎస్‌బీఓఏ నుంచి ఎలాంటి సమాచారం అందలేదని పాఠశాల యాజమాన్యాలు పేర్కొంటున్నాయి. రోడ్లపై ఏర్పడిన భారీ గుంటలకు బీఎంసి దే బాధ్యత అని పాఠశాల యాజమాన్యాలు అంటున్నాయి. కానీ ఆ కారణంగా బస్సు సర్సీస్ ను నిలిపివేయడం అన్యాయమని యాజమాన్యాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే తల్లిదండ్రులు మాత్రం బస్ డ్రైవర్లకు మద్దతు తెలుపుతున్నారు. వర్షాలు పడినప్పుడు రోడ్ల మీద ఏర్పడిన గుంటల ద్వారా ప్రయాణం చేయడం ప్రమాదకరం అని... దాని కన్నా విద్యార్థులు స్కూల్ మానేయడమే ఉత్తమమని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు.

  • Loading...

More Telugu News