: ప్రైవేటు బీమా కంపెనీల కన్నా ఎల్ఐసీ చాలా మెరుగు


దేశంలో ఎల్ఐసీ శ్రేష్ఠమైన బీమా కంపెనీ అని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏ)అంటోంది. ప్రైవేటు బీమా కంపెనీల కన్నా ఎల్ఐసి బీమాదారులకు మెరుగైన సేవలు అందిస్తోందని తమకందిన సమాచారం తేటతెల్లం చేస్తోందని ఐఆర్‌డీఏ స్పష్టం చేసింది. ప్రైవేటు రంగంలోని కొన్ని బీమా కంపెనీలు అబద్ధపు సమాచారంతో వినియోగదారులను ఆకర్షించి, మోసం చేస్తున్నాయని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏ)కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. ప్రైవేటు బీమా కంపెనీలు ఆయా పాలసీల వల్ల వచ్చే ఆదాయాన్ని మరింత ఎక్కువ చేసి వినియోగదారులకు వల విసురుతున్నాయి. అయితే చివరికి చెప్పినంత మొత్తం మాత్రం బీమాదారుడికి అందడం లేదు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ ప్రారంభం నుంచి జులై 20వ తేదీ వరకు తమకు అందిన ఫిర్యాదులను ఐఆర్ డీఏ విశ్లేషించింది. అత్యధికంగా హెచ్‌డీఎఫ్‌సీ స్టాండర్డ్‌ లైఫ్‌కు వ్యతిరేకంగా 10,819 ఫిర్యాదులు అందాయి. బిర్లా సన్‌ లైఫ్‌పై 6,185, రిలయన్స్‌ లైఫ్‌పై 6,168 ఫిర్యాదులు నమోదయ్యాయి. ఇతర ప్రైవేటు కంపెనీలైన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌పై 3,649, బజాజ్‌ అలియంజ్‌పై 5,441, మ్యాక్స్‌ న్యూయార్క్‌ లైఫ్‌పై 2,615, ఎస్‌బీఐ లైఫ్‌పై 2,190 ఫిర్యాదులు నమోదయ్యాయని ఐఆర్‌డీఏ తెలిపింది. ప్రభుత్వరంగంలోని ఎల్‌ఐసీకి వ్యతిరేకంగా కేవలం 763 ఫిర్యాదులు మాత్రమే వచ్చాయని ఐఆర్‌డీఏ తెలిపింది. దేశీయ బీమా మార్కెట్లో 80 శాతానికి పైగా వాటాతో నెంబర్ వన్ గా కొనసాగుతున్న ఎల్‌ఐసీపై ఫిర్యాదులు అతి తక్కువ సంఖ్యలో నమోదు కావడం విశేషమని బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ అంటోంది. ప్రతీ ఏడాదీ బీమా కంపెనీలపై అందుతున్న ఫిర్యాదుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2011-12లో లక్ష ఫిర్యాదులు అందగా, 2012-13 సంవత్సరానికి 1.68 లక్షలకు, 2013-14 ముగిసే నాటికి 2.11 లక్షలకు ఫిర్యాదులు చేరుకున్నాయి.

  • Loading...

More Telugu News