: వోల్వో డిజైన్ మారుతోంది!
శరవేగంతో దూసుకుపోవడమే కాక, సుఖ ప్రయాణాన్ని కూడా అందిస్తుందనుకున్న వోల్వో బస్సు భారత రహదారులపై చేదు అనుభవాలనే మిగిల్చింది. గతేడాది మహబూబ్ నగర్ జిల్లా పాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 45 మంది ప్రయాణికులు చనిపోవడానికి కారణమైంది. ఆ ఘటన మరిచిపోకముందే, కర్ణాటకలో జరిగిన మరో రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతికి కారణంగా నిలిచింది. దీంతో అసలు వోల్వో బస్సులు భారత రహదారులకు పనికివస్తాయా? అన్న ప్రశ్న తెరపైకొచ్చింది. ఈ అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చనే నడిచింది. దీంతో స్పందించిన కేంద్ర ప్రభుత్వం, వోల్వో బస్సు డిజైన్, భారత రహదారులకు ఏ మేరకు అనుకూలం, వోల్వో బస్సులు ప్రమాదాలకు గురైనప్పుడు భారీ ప్రాణ నష్టం సంభవించడానికి గల కారణాలు ఏమిటన్న అంశాలను తేల్చాలని నేషనల్ ఆటోమోటివ్ టెస్టింగ్ అండ్ ఆర్అండ్ డీ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు (ఎన్ఏటీఆర్ ఐపీ)కి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో సుదీర్ఘ సమయం వెచ్చించి పరిశీలన జరిపిన ఆ సంస్థ, ఇటీవలే కేంద్రానికి తన నివేదికను సమర్పించింది. ఎన్ఏటీఆర్ ఐపీ అధ్యయనం ప్రకారం, వోల్వో బస్సుల్లో డీజిల్ ట్యాంకులు, బస్సు మధ్య భాగంలో కాకుండా ఓ పక్కగా నిర్మితమవుతున్నాయి. దీంతో రోడ్డు డివైడర్లను బస్సు ఢీకొన్న సమయంలో వెనువెంటనే ట్యాంకులు పేలిపోతున్నాయి. పాలెం దుర్ఘటనలో ఇదే జరిగిందని అధ్యయన నివేదిక తేల్చిచెప్పింది. ఆ ఘటనలో, బస్సు కల్వర్టును ఢీకొట్టగానే డీజిల్ ట్యాంక్ పేలి క్షణాల వ్యవధిలో బస్సు మంటలకు ఆహుతైంది. అంతేకాక ప్రయాణికులు తేరుకునేలోగానే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వెల్లడించింది. దీంతో బస్సుకు సరిగ్గా మధ్య భాగంలో డీజిల్ ట్యాంకు ఉండేలా వోల్వో డిజైన్ మారాల్సిందేనని సిఫారసు చేసింది. అంతేకాక ఎయిర్ కండీషన్ సౌకర్యంతో తయారవుతున్న వోల్వో బస్సుకు అమర్చుతున్న అద్దాలు దళసరిగా ఉండటంతో ప్రమాద సమయంలో వాటిని బద్దలు కొట్టడం దుస్సాధ్యంగా మారుతోంది. మరోవైపు అత్యవసర ద్వారాలు అసలే ఉండటం లేదు. దీంతో అత్యవసర ద్వారాలు అమర్చడంతో పాటు బస్సు అద్దాల మందాన్ని కాస్త తగ్గించాల్సిందేనని కూడా ఆ అధ్యయనం సిఫారసు చేసింది. నివేదికను అందుకున్న కేంద్రం, అధ్యయనంలో వెలుగు చూసిన పలు లోపాలను సరిచేయాల్సిందేనని వోల్వోకు తేల్చిచెప్పనుందని సమాచారం. డిజైన్ లో మార్పులు జరగని పక్షంలో వోల్వో బస్సులను దేశంలోకి అనుమతించబోమని కూడా బస్సుల తయారీ సంస్థకు హెచ్చరికలు జారీ చేసేందుకు కేంద్రం సిద్ధపడిందని రవాణా శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వోల్వోకు భారత్ లో మంచి మార్కెట్ ఉన్న నేపథ్యంలో, డిజైన్ మార్పుకే ఆ సంస్థ మొగ్గుచూపనుందని రవాణా రంగ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.