: ఆండర్సన్ పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడని ధోనీ


మిస్టర్ కూల్... ఇది ధోనీకి అభిమానులు పెట్టుకున్న పేరు. ఎలాంటి పరిస్థితుల్లోనూ కూడా ఆగ్రహావేశాలకు, ఉద్వేగాలకు లోనుకాని తత్వమే ధోనీకి ఈ పేరు తీసుకొచ్చింది. అలాంటి ధోనీ ఇప్పుడు ఓ క్రికెటర్ పై అంతులేని ఆగ్రహంతో ఉన్నాడు. ఎంతగా అంటే... కనీసం అతని పేరు ఉచ్చరించడానికి కూడా ఇష్టపడనంతగా! జడేజాతో గొడవ ఉదంతంలో ఇంగ్లండ్ క్రికెటర్ ఆండర్సన్ పై ధోనీ మండిపడుతున్నాడు. గొడవ జరిగిన రోజు ఏం జరిగిందో ధోనీ వివరంగా తెలిపాడు. "లంచ్ బ్రేక్ లో అందరం పెవిలియన్ కు బయలుదేరాం. ఇంతలో అతను జడేజాను బూతులు తిట్టడం ప్రారంభించాడు. నేను కల్పించుకున్నా... అంతా సమసిపోయిందని భావించా. మెంబర్స్ ఏరియా నుంచి నడుస్తున్న సమయంలో అతను మళ్లీ జడేజాను ఏదో అన్నాడు. జడేజా అతని వైపు తిరిగాడు. ఆ సమయంలో అతను జడేజాను నెట్టేశాడు. అదుపుతప్పిన జడేజా... ఏం జరుగుతోందా? అని అతని వైపు చూశాడు. ఈ మాత్రం దానికే జడేజాకు ఫైన్ వేశారు. రిఫరీ తీసుకున్న నిర్ణయాన్ని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. ఇది ముమ్మాటికీ క్రీడా స్పూర్తి కాదు. జడేజా ఒక్క మాట కూడా అనలేదు... తప్పంతా ఆ క్రికెటర్ దే. అవతలి వాడు తిడితే... జడేజా ఫీజులో కోత విధించడం ఏమిటి? దీనిపై అప్పీల్ చేయాలనే నేను కోరుకుంటున్నా. ఇలా జరిగితే... మైదానంలో సంయమనంతో మెలగాలని మా ఆటగాళ్లకు నేనెలా చెప్పగలను? వాళ్లు నా మాట వింటారా?" అంటూ ఆ రోజు జరిగిన ఘటనను ధోనీ వివరించాడు. ఈ సమయంలో ఆండర్సన్ పేరును ధోనీ ఉచ్చరించకపోవడం గమనార్హం!

  • Loading...

More Telugu News