: కివీస్ పార్ట్ టైం స్పిన్నర్ విలియంసన్ కు ఐసీసీ షాక్
న్యూజిలాండ్ జట్టు ఆశాకిరణం కేన్ విలియంసన్ కు ఐసీసీ షాకిచ్చింది. విలియంసన్ బౌలింగ్ యాక్షన్ నిబంధనలకు విరుద్ధమని తేల్చిన ఐసీసీ అతను ఇకపై బౌలింగ్ చేయరాదని స్పష్టం చేసింది. ఐసీసీ ప్రస్తుత నిబంధనల ప్రకారం బౌలర్ 15 డిగ్రీల కంటే ఎక్కువగా మోచేతిని వంచరాదు. జూన్ లో విండీస్ గడ్డపై జరిగిన రెండో టెస్టు సందర్భంగా అంపైర్లు ఇయాన్ గౌల్డ్, ఇల్లింగ్ వర్త్, రాడ్ టకర్ ల ఫిర్యాదుతో ఐసీసీ విలియంసన్ బౌలింగ్ ను పరిశీలించింది. ఈ మేరకు కార్డిఫ్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీలో విలియంసన్ కు బయోమెకానికల్ పరీక్షలు నిర్వహించారు. అతని మోచేయి పరిమితికి మించి వంగుతోందని వర్శిటీ నిపుణులు గుర్తించారు. దీంతో, ఐసీసీ విలియంసన్ బౌలింగ్ పై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై, విలియంసన్ బౌలింగ్ చేయాలంటే ఐసీసీ నిపుణుల పర్యవేక్షణలో బౌలింగ్ తీరును సరిచేసుకోవాల్సి ఉంటుంది. దీనిపై విలియంసన్ స్పందిస్తూ, కార్డిఫ్ వర్శిటీ నిపుణులు పేర్కొన్న అభ్యంతరాలు మదిలో ఉంచుకున్నానని, వాటిపై దృష్టిపెడతానని తెలిపాడు. న్యూజిలాండ్ జట్టులో ప్రతిభావంతుడిగా పేరుతెచ్చుకున్న విలియంసన్ 34 టెస్టులాడి 40.28 సగటుతో 2377 పరుగులు చేశాడు. బౌలింగ్ లో 24 వికెట్లు తీశాడు.