: గోదారి గలగల... కృష్ణమ్మ వెలవెల!
గోదావరి నది మహరాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నిండుగా ప్రవహిస్తోంది. జలకళ సంతరించుకున్న గోదావరిని చూస్తే ఆనందం వేస్తోంది. ప్రమాద స్థాయికి సమీపంలో గోదావరి నది పొంగి పొరలుతోంది. నదిలోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం రెండు రోజుల క్రితం 33 అడుగులకు చేరింది. ప్రాణహిత, పెన్ గంగ నదులు నిండుగా ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. కానీ, కృష్ణానది పరిస్థితి మాత్రం ఇందుకు విరుద్ధం. నీరు లేక కృష్ణమ్మ వెలవెలబోతోంది. ఆల్మట్టి ప్రాజెక్టు వద్ద నీరు వదలకపోవడంతో.. నారాయణపూర్ ప్రాజెక్టు నిండడం గగనమే. శ్రీశైలం జలాశయంలో నీరు రోజురోజుకీ అడుగంటుతోంది. రైతన్న గుండెల్లో గుబులు రేగుతోంది. ఇప్పటికే వేసిన కంది, మొక్కజొన్న తదితర పంటలు దెబ్బతిన్నాయి. నాగార్జున సాగర్ లో పూర్తి స్థాయి నీటిమట్టం 513 అడుగులు. గతేడాది సాగర్ నీటిమట్టం 521 అడుగులు ఉండగా... ప్రస్తుత నీటిమట్టం 511 అడుగులు మాత్రమే ఉంది. సాగర్ రిజర్వాయర్ లో నీటి నిల్వ 133 టీఎంసీలు మాత్రమే.