: సముద్ర పరిశోధనలో భారత్ మరో ముందడుగు


సముద్ర పరిశోధనలో భారత్ మరో మైలురాయిని చేరుకునేందుకు దగ్గరైంది. సముద్ర జలాల్లో వస్తున్న మార్పులు, శీతోష్ణ స్థితిగతులు, అండర్ కరెంట్, జీవజాలాల పరిస్థితి వంటి అనేక అంశాలపై పరిశోధనలు జరిపేందుకు తొలి అత్యాధునిక నౌక సింధుసాధనను భారత శాస్తవ్రేత్తలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేశారు. కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ అధీనంలో పనిచేస్తున్న కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్‌ఐఆర్) ఆధ్యర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ శాస్త్రవేత్తలు ఈ నౌకను రూపొందించారు. ఈనెల 12వ తేదీన సింధుసాధన నౌక లాంఛనంగా జలప్రవేశం చేసింది. సింధుసాధన నౌక ఈ నెల 27 నుంచి సుమారు నెలరోజుల పాటు విశాఖ-అండమాన్ సముద్ర ప్రాంతంలో పరిశోధనలు జరపడానికి సమాయత్తం అవుతోంది. ఈ నౌక విశాఖ నుంచి అండమాన్ సముద్ర జలాలపై తన తొలి పరిశోధనలను ప్రారంభించనుంది. విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు ఈ నెల 27న సింధుసాధన ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు. 80 మీటర్ల పొడవు, 17.6 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌకలో 29 మంది శాస్తవ్రేత్తలు, 28 మంది నౌకా సిబ్బంది ఉంటారు. 13.5 నాటికల్ మైళ్ళ వేగంతో ఈ నౌక ప్రయాణిస్తుంది. ఈ పరిశోధక నౌకలో పరిశోధన కోసం 10 ప్రయోగశాలలు ఉంటాయి.సుమారు 220 కోట్ల ఖర్చుతో సింధుసాధన నౌకను గుజరాత్ లోని ఎబిజి షిప్ యార్డ్ లో నిర్మించారు.

  • Loading...

More Telugu News